Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
- 'విద్యారంగం గాంధీ ఆలోచనలు' పుస్తకావిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మాగాంధీ బోధనలు నేటికీ అనుసరణీయమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి అన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఎస్డి సుబ్బారెడ్డి రచించిన 'విద్యారంగం గాంధీ ఆలోచనలు'అనే పుస్తకాన్ని హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం లింబాద్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ సూచించిన అభిప్రాయాలు విద్యారంగంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని చెప్పారు. ఉన్నత విద్యలో పలు కోర్సుల్లో గాంధీతత్వాన్ని, విద్యా, వైజ్ఞానిక రంగాల్లో కొన్ని పాఠ్యాంశాలుగా చేర్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి పలు అంశాలను తీసుకెళ్తామని వివరించారు. సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంపై గాంధీ చేసిన సూచనలతోపాటు చారిత్రక, సామాజిక అంశాలను లోతుగా ఈ పుస్తకంలో పొందుపరిచారని అన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త కె పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ గాంధీ ప్రవచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. పర్యావరణ విద్యనూ ముఖ్యమైన అంశంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మెన్ గున్న రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గాంధీ సిద్ధాంతాన్ని, ఐక్యరాజ్యసమితి గుర్తించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం రెండు దశాబ్ధాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ పుస్తకంలో రచయిత అభిప్రాయాలు వర్తమాన, సామాజిక, సాంస్కృతిక అంశాలు విద్యాభివృద్ధిలో ఎంతో ముఖ్యపాత్రను పోషిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, విద్యావేత్తలు ప్రకాశ్, పుల్లయ్య, ఎంవి గోనారెడ్డి, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, కేజీ టు పీజీ విద్యాసంస్థల చైర్మెన్ గింజల రమణారెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి, సభ్యులు టి జయరాంరెడ్డి, ఎంఎస్కో పబ్లిషర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రచయిత దంపతులను లింబాద్రి, రాజేందర్‌రెడ్డి సత్కరించారు.