Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఘటన
నవతెలంగాణ-మర్పల్లి
వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని కల్కోడలో గురువారం జరిగింది. బాధిత కుటుంసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఫకీర్ మహమ్మద్ తన పెద్ద కూతురు అమీనా బేగం(20)ను 6 నెలల కిందట సదాశివపేట మండలం మాచిరెడ్డిపల్లికి చెందిన ఖాజా పాషకు ఇచ్చి వివాహం చేశాడు. పెండ్లి సమయంలో వరకట్నం కింద రూ.50 వేల నగదు, రెండున్నర తులాల బంగారం, బైక్ ఇచ్చారు. కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది. ఆరు నెలల అనంతరం మరో లక్ష రూపాయలు అదనంగా తీసుకురావాలని భర్తతో పాటు అతని కుటుంబసభ్యులు అమీనాబేగాన్ని వేధించారు. వేధింపులు భరించలేక ఆమె రెండు నెలల కిందట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబసభ్యులు ఇక్కడ ఉంటే తమ కూతురిని చంపేస్తారని వారి ఇంటికి తీసుకెళ్లారు. అమీనా బేగం తల్లిదండ్రుల వద్ద ఉంటున్నా భర్త ఫోన్లో అదనపు కట్నం తెస్తావా లేదా మరో పెండ్లి చేసుకోవాలా అంటూ వేధించసాగాడు. వేధింపులు భరించలేక ఆమె తమ పొలంలో ఎవ్వరూ లేని సమయంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుర్తించిన కుటుంబసభ్యులు స్థానికుల సాయంతో మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటశ్రీను తెలిపారు.