Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కస్తూర్బా'లో విద్యార్థినుల బైటాయింపు
- 6 సబ్జెక్టులకు ముగ్గురే లెక్చరర్లు
- మీరు ఎవరికైనా చెప్పుకోండి.. భయపడను : ఎస్ఓ
నవతెలంగాణ - అయిజ
''మేం తిండి కోసం ఇక్కడికి రాలేదు.. చదువు ముఖ్యం.. ఆరు సబ్జెక్టులకు ముగ్గురే లెక్చరర్లు ఉన్నారు.. పరీక్షలకు మూడు నెలలే ఉంది.. ఎలా రాయాలి.. ఫెయిల్ అయితే పరిస్థితేంటి..? మా తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి.. వెంటనే లెక్చరర్లను నియమించండి'' అంటూ కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని కస్తూర్బా పాఠశాల ఆవరణలో ఇంటర్ విద్యార్థినులు నిరసన తెలిపారు. ఈ విషయం తెలిసి మీడియా అక్కడికి చేరుకోగా.. జర్నలిస్ట్ ముందే ''మీరు ఎవరికైనా చెప్పుకోండి.. నేను భయపడను'' అంటూ ఎస్ఓ విద్యార్థినులను బెదిరించారు. అలాగే, మీడియాను కూడా మీరు ఎందుకు లోపలికి వచ్చారు అంటూ చిందులు వేశారు. అనంతరం విద్యార్థినులు మీడియాతో మాట్లాడుతూ.. మాకు మూడుపూటలా అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ చదువు కావాలన్నారు. 6 సబ్జెక్టులకు ముగ్గురే లెక్చరర్లు ఉన్నారని, ఈ విషయంపై ఎస్ఓకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించిన లెక్చరర్లను నియమించాలని కోరారు. అలాగే, బాత్రూమ్లు కూడా సరిగా లేవని, ఎస్ఓ మేడంను ఏది అడిగా సరిగా స్పందించడం లేదని అన్నారు.