Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3 కోట్ల 1820 కిలోలు
- ఐదుగురు అరెస్ట్
- లారీ, కారు సీజ్, రూ.41వేలు, 7 సెల్ ఫోన్లు సీజ్
- వివరాలు వెల్లడించిన సీపీ
నవతెలంగాణ- హయత్‌నగర్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. 3కోట్ల విలువైన 1820 కిలోల గంజాయిని పట్టుకుని, ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి లారీ, కారును స్వాధీనం చేసుకుని, రూ.41వేలు, 7 సెల్ఫోన్లను సీజ్ చేశారు. సీఎం ఆదేశాల మేరకు నార్కోటిక్స్ డ్రగ్స్‌పై పటిష్ట చర్యలు చేపట్టామని రాచకొండ పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీ మహేశ్ మురళీధర్ భగవత్ తెలిపారు. గురువారం ఎల్బీనగర్లోని క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన సంజరు లక్ష్మణ్ షిండే, సంజరు బాలాజీ కాలే, అభిమాన్ కళ్యాణ్ పవార్, సంజరు చౌగులే, భరత్ కౌలప్ప ఏలే.. వీరంతా బంధువులు. అలాగే, పశ్చిమబెంగాల్ నదియా జిల్లాకు చెందిన షేక్ రహిడెల్ కూడా వారికి దూరపు బంధువు. వీరంతా ముఠాగా ఏర్పడి మొక్కల వర్మీ కంపోస్టు మాటున గంజాయి సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వయా నర్సీపట్నం మీదుగా రాజమండ్రి, కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్.. హైదరాబాద్, వెస్ట్‌బెంగాల్, మహారాష్ట్రకు లారీల్లో గంజాయి తరలిస్తున్నారు. కిలో గంజాయి రూ.8 వేలకు కొనుగోలు చేసి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. లక్ష్మణ్షిండే గతంలో అనేక కేసుల్లో నిందితుడు. గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు, ఎస్వోటీ పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ వద్ద లారీని తనిఖీ చేశారు. లారీకి ముందుగా ఒక కారును ఎస్కార్ట్‌గా పెట్టుకుని.. లారీ పైన వర్మీ కంపోస్టు ఎరువు కింద గంజాయి పాకెట్స్ పెట్టి తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి మొత్తం 1820 కేజీల గంజాయి, లారీ, కారు, 41 వేల నగదు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ 3 కోట్ల 7 లక్షల 93 వేలు ఉంటుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన లక్ష్మణ్ షిండే పరారీలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5 వేల కిలోల గంజాయి పట్టుకున్నారు. 31 మంది నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రెస్మీట్లో అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, ఎస్ఓటీ డీసీపీ సురేందర్ రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవి కుమార్, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్స్పెక్టర్ స్వామి, ఎస్ఐ అవినాష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.