Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాధర్నా జయప్రదం...
- ధర్నాచౌక్‌కు భారీగా తరలొచ్చిన అన్నదాతలు
- ప్రజా, కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాల మద్దతు
- ఎంఎస్పి చట్టం, 'విద్యుత్ బిల్లు' రద్దయ్యేంత వరకూ ఉద్యమం : అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్త రైతాంగ ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నా జయప్రదమైంది. ఇది తెలంగాణ రైతులతోపాటు వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ సంఘాల నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ఎస్కేఎం జాతీయ నాయకులు రాకేశ్ తికాయత్, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, ఏఐకేఎస్ నేత అతుల్ కుమార్ అంజన్, ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ నేత ఆశిష్ మిట్టల్, ఉత్తరాఖండ్ రైతు ఉద్యమ నేత జగ్తర్ బాజ్వతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రజా, కార్మిక,మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు మహా ధర్నాకు తరలొచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నాలో రైతు వ్యతిరేక చట్టాలు, దేశవ్యాప్త రైతాంగ ఉద్యమ నేపథ్యాన్ని నేతలు వివరించారు. ఇందుకనుగుణంగా ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన పాటలు రైతు సమస్యలను కండ్లకు కట్టాయి. వక్తలు మాట్లాడుతున్నంత సేపు సభికుల ఈలలు, నినాదాలతో ధర్నాచౌక్ ప్రాంతం మార్మోగింది. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, నిరంకుశ మోడీ సర్కార్ డౌన్.. డౌన్...అంటూ రైతులు నినాదాలు చేశారు. కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి, విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి, పోడు భూములకు పట్టాలివ్వాలి, ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే స్లోగన్స్‌తో వారు అక్కడి ప్రాంతాలను హోరెత్తించారు. రైతు ఉద్యమ నేతలు తికాయత్, హన్నన్ మొల్లా తదితరులను కలిసేందుకు రైతులు పోటీ పడ్డారు. స్వాతంత్య్రోద్యమం తర్వాత ఆ స్థాయిలో శాంతియుతంగా రైతాంగ ఉద్యమాన్ని నడిపారంటూ పలువురు విద్యావంతులు, మేధావులు వారిని అభినందించారు. మహిళా నేత ఇందిరా శోభన్... రాకేశ్ తికాయత్‌కు శాలువా కప్పి సత్కరించారు.