Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మహిళలపై 'బాబా', అతని కొడుకు దారుణాలు
- బాధితుల ఫిర్యాదుతో నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
అనారోగ్యమంటూ ఓ మహిళ మాంత్రికుడిని సంప్రదిస్తే.. దయ్యం పట్టిందని మాయమాటలు చెప్పి లైంగికదాడి చేశాడు.. ఆ తర్వాత ఆమె చెల్లెలిపైనా దారుణానికి ఒడిగట్టాడు. అతని కొడుకూ వారిపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితులు, దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం..పాతబస్తీ కిషన్‌బాగ్‌కు చెందిన ఓ మహిళ తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో బంధువుల సూచనమేరకు 2005లో చాంద్రాయణగుట్టలో మాంత్రికుడు సయ్యద్ హసన్ అక్సారీ(బాబా) వద్దకు వెళ్లింది. తల్లి ఆరోగ్యం బాగవడంతో అతని వల్లే జరిగిందని ఆ మహిళ నమ్మింది. ఆ తర్వాత సదరు మహిళ కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. బాధిత మహిళపై కన్నేసిన సయ్యద్ హసన్ అక్సారీ 'నీకు విడాకులిచ్చిన భర్తే చేతబడి చేశాడు' అని నమ్మించాడు. మంత్రాలు, తాయెత్తులు తదితర చికిత్సకు ఖర్చుల కోసం ఆమె తన ఇల్లును కూడా అమ్ముకుంది. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఆమెను మాయమాటలతో లొంగదీసుకున్నాడు. తాను చెప్పినట్టు వినకపోతే పట్టిన దెయ్యం వదలదని భయపెట్టాడు. దీంతో ఆమె తరచూ బాబా సయ్యద్ హసన్ అక్సారీని సంప్రదిస్తూ ఉండేది. సదరు మహిళ భయాన్ని బలహీనతగా చేసుకుని 2016 నుంచి దారుణానికి ఒడిగట్టాడు. ఆమె చెల్లెలినీ అలాగే లొంగదీసుకున్నాడు. అక్క భర్త మంత్రాలు చేశాడని చెల్లెలినీ భయపెట్టి లైంగికదాడి చేశాడు. ఈ విధంగా అక్కచెల్లెళ్లిద్దరిపైనా బాబా సయ్యద్ హసన్ అక్సారీతోపాటు అతని కొడుకు సయ్యద్ అఫ్రోజ్ లైంగిక దాడి చేస్తూ వచ్చారు. అయితే, వారితో విసిగిపవోయిన బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు తండ్రీ కొడుకులిద్దరినీ అరెస్టు చేశారు.