Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూసేకరణ కేసుల్ని హైకోర్టులు సుమోటోగా తీసుకోవాలి: అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీకి లబ్దిచేకూర్చేందుకే ఒవైసీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) జాతీయ నాయకులు రాకేశ్ తికాయత్ అన్నారు. ఒవైసీలు ఎక్కడ పోటీచేస్తే, అక్కడ ఓట్ల చీలిక ఏర్పడి బీజేపీ గెలుస్తుందనీ, ఈ రెంటి మధ్యా మ్యాచ్‌ఫిక్సింగ్ జరుగుతున్నదని చెప్పారు. గురువారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో సమన్వయ కమిటీ నాయకులు అతుల్ కుమార్ అంజన్, ఆశిష్ మిట్టల్, జగతార్వాజ్వా తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్లో ఏ ఒక్కదాన్నీ కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకోలేదని ఆక్షేపించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న భూసేకరణను ఉన్నత న్యాయస్థానాలు సుమోటోగా తీసుకొని విచారణలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 2003 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా, ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అవలంబిస్తున్నదనీ, దీనివల్ల రైతాంగం నష్టపోతున్నారని వివరించారు. కౌలు రైతుల సమస్యలపై కేంద్రప్రభుత్వంతో ఇప్పటికి రెండు, మూడుసార్లు చర్చలు జరిపామనీ, దీనిపై సమగ్ర చర్చ, సత్వర నిర్ణయాలు అత్యవసరమని చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాల రూపకల్పన సమయంలో ప్రధాని మోడీ ఏ ఒక్కరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా నియంతృత్వంగా వ్యవహరించారని విమర్శించారు. ఆయన దేశాన్నే అమ్మకానికి పెట్టారని అన్నారు. ఇప్పటికే దేశంలోని గోదాములన్నింటినీ రిలయన్స్ అంబానీలకు అప్పగించారనీ, కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో భూముల్ని ఏండ్ల తరబడి లీజుకు తీసుకొని పడావు పెట్టి, తక్కువ ఉత్పత్తి, ఎక్కువ డిమాండ్, మార్కెట్ ఎత్తుగడలతో కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాన్ని కేంద్రప్రభుత్వం చేస్తున్నదని తెలిపారు. పెద్ద పరిశ్రమలకు చీప్ లేబర్‌ను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ నిరుద్యోగ ఉపాధి హామీ పథకాలు ఉన్నాయని విమర్శించారు. కేంద్రంలో అగ్రికల్చర్ కేబినెట్‌ను ఏర్పాటు చేయాలని విలేకరుల సమావేశం అనంతరం ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. వ్యవసాయంతో 18 శాఖలు అనుసం ధానమై ఉన్నాయనీ, వాటిలో ఎరువులు, విద్యుత్, పర్యావరణం, విదేశీ వ్యవహారాలు, మార్కెటింగ్, గిడ్డంగులు సహా పలు శాఖలు ఉంటాయన్నారు. వాటన్నింటినీ ఒకచోటకు చేరిస్తే, అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని వివరించారు. ఆ దిశగా కేంద్రప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఘర్షణ పైనా ఆయన స్పందించారు. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీ అక్కడి ప్రభుత్వా లతో ఇదే తరహాలో వ్యవహరిస్తూ, తమ శ్రేణులకు అజెండాను సెట్ చేసి ఇస్తుందంటూ పలు సంఘట నలను ఉదాహరించారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత పెంచడమే బీజేపీ జాతీయ నాయకత్వ లక్షణమనీ, దానిలో భాగంగానే తెలంగాణలో కూడా వ్యవహరిస్తున్నారని విశ్లేషించారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్, అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) తెలంగాణ రాష్ట్ర నాయకులు టీ సాగర్, పశ్య పద్మ, విస్సాకిరణ్, వెంకట్రామయ్య, రాయల చంద్రశేఖర్ పాల్గొన్నారు.