Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు పంటకు రక్షణ కరువు
- కల్లాలో ధాన్యం మొలకలు.. తల్లడిల్లుతున్న రైతులు
- నెల రోజులైనా గింజ ధాన్యం కొనుగోలు చేయని వైనం
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
- బోరుమంటున్న రైతాంగం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
''ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట.. కండ్ల ముందే ఆగమైపోతుంటే పాణం తల్లడిల్లుతుంది. వరి కోతలు కోసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో.. ధాన్యం ఎక్కడ పోయాలో దిక్కుతోచక రోడ్ల మీద ఆరబెట్టుకుంటున్నాం. వర్షాలతో ధాన్యం తడిసి మొలకలొచ్చాయి. పంట పండించడం ఒకెత్తయితే.. చేతికొచ్చినాక విక్రయించడానికి నానా తంటాలు పడాల్సివస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా జీవితాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి తప్ప మా గోడు పట్టించుకోవడం లేదు. మా బతుకులు అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం తప్ప.. బతికి బట్టకట్టే పరిస్థితి కనిపించడం లేదని'' రైతు జంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఒక జంగారెడ్డి ఆవేదనే కాదు జిల్లాలో ఏ రైతును మందలించిన.. వ్యవసాయం సాగు చేసుడు కంటే చేయకుండా నయమున్నది.. యేటికేడు పంట సాగు చేసినా అప్పులు పెరగడం తప్ప ఏమీ లాభం లేదు.. అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకుందమంటే.. కొనుగోలు చేసేవారూ దిక్కులేరాయే.. సర్కారు పట్టించుకోకపాయే.. మా బతుకులకు భరోసా ఇచ్చేదెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాధారణంగా వరి సాగు విస్తీర్ణం తక్కువగానే ఉంటుంది. సాగు నీటి సౌకర్యం లేక పోవడంతో బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగుతుంది. రెండేండ్లుగా వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో ఉమ్మడి జిల్లాలో 2,00,497 ఎకరాల్లో వరి సాగు చేయగా 5లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రానుంది. ఇందులో ప్రభుత్వం 164 కేంద్రాల ద్వారా 3.80లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలనేది రైతులకు పెద్ద సమస్యగా మారింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకోలేక.. తడిచిన ధాన్యం రంగు మారడం.. మొలకలు రావడంతో రైతులు పంట నష్టం తీవ్రస్థాయికి చేరింది.
ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
రంగారెడ్డి జిల్లాలో 38 కేంద్రాలకు సుమారు 15 కొనుగోలు కేంద్రాలు.. వికారాబాద్ జిల్లాలో 126 కొనుగోలు కేంద్రాలకు గాను 63 కేంద్రాలు ప్రారంభించినప్పటికీ.. నేటి వరకు ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదు. దాంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేస్తుందా..? లేదా అన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడలేక దళారులను ఆశ్రయిస్తే.. క్వింటాలు రూ.1200కి ఇస్తే ఇవ్వు లేదంటే లేదని.. మిల్లర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇటు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న నమ్మకం లేక.. వర్షాలతో చేతికొచ్చిన పంటను పాడు చేసుకోలేక. దళారులు చెప్పిన రేటుకు కొంత మంది రైతులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రయివేటు దళారులకు అమ్ముకుంటే ఆరు నెలలు కష్టపడి పండించిన పంటకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వండ్లు కొనేనా..
సర్కారు వండ్లు కొనుగోలు చేస్తదన్న నమ్మకం లేదు. పోయిన నెల 30వ తేదీన 2 ఎకరాలు వరి కోసిన.. మార్కెట్ తెరువకపోవడంతో వడ్లు రోడ్డు మీద పోసిన. మంచిగా ఆరినయి అనుకునేలోపే వర్షాలకు తడిచి మొలకలు వచ్చినయి.. రాక రాక మంచి దిగుబడి వచ్చిందన్న ఆనందం వరదలో కొట్టు కు పోయింది. మార్కెట్ తెరిచే సరికి ఇంక ఎంత ధాన్యం పాడవుతుందోనన్న భయం వెంటాడుతుంది.
రైతు సిమ్మల అంజిరెడ్డి.. కొహెడ గ్రామం
సన్నోడ్లు తీసుకోమంటున్నారు
సన్నోడ్లకు మంచి ధర పలుకతది.. సన్నాళ్లు సాగు చేయాలంటే సర్కారు మాటతో మూడెకరాలు సాగు చేసిన.. ఇప్పుడేమో సన్నోడ్లు సర్కారు మార్కెట్లో తీసుకో మంటున్నారు. ఎక్కడకి తీసుకుపోయి అమ్మాలో తెలియడం లేదు. వరి కోసి 20 రోజులవుతుంది. ఇప్పటికీ మూడు దఫాల ధాన్యం తడ్చింది. ఈ ధాన్యం అమ్ముడెట్లో దిక్కుతోచడం లేదు.
- కౌలు రైతు ఎల్లయ్య, తొర్రూరు