Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది రాజకీయ క్రీడ
- రైతు మహాధర్నాలో ఏఐకేఎస్‌సీసీ, ప్రజాసంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెల్ల చట్టాల అమలు కోసం మరో ఉద్యమం తప్పదని ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు, ప్రజాసంఘాల నేతలు తేల్చిచెప్పారు. సాగు చట్టాల రద్దు అంశం పార్లమెంట్లో ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. నల్ల చట్టాల రద్దుకోసం ఢిల్లీలో రైతు ఉద్యమం ప్రారంభమై ఏడాది అయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో గురువారం రైతు సంఘాల నేతృత్వంలో మహాధర్నా జరిగింది. ఈ సందర్భంగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలకు తలొంచిన మోడీ సర్కార్ నల్ల చట్టాలను రద్దు చేస్తేనే సరిపోదనీ, తెల్ల చట్టాల అమలు సంగతేందో తేల్చాలన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతుధర చట్టం చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోకపోతే..దేశం ముఖ్యంగా, రాష్ట్రం ఆంధకారమయమై పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా సాగుతున్న రైతు ఉద్యమంలో వందల మంది రైతులు చనిపోయారనీ,వారి కుటుంబాలకు ఎక్సిగ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులపై, ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. రైతాంగ ఉద్యమం పట్ల పాశవికంగా వ్యవహరిస్తే..ప్రపంచాన్ని వణికించిన హిట్లర్‌కు పట్టిన గతే..చివరికి బీజేపీకి పడుతుందని హెచ్చరించారు.ఏఐకేఎస్‌సీసీ నేషనల్ వర్కింగ్ గ్రూపు సభ్యులు వేముల పల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల విధానాలను మోడీ సర్కార్ అమలు చేస్తున్నదని చెప్పారు. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను బలపర్చే వారికి మోడీ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాల పట్ల బీజేపీ ప్రభుత్వం దొంగనాటకాలు ఆడుతుందని విమర్శించారు. ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్ టి సాగర్ మాట్లాడుతూ తెల్ల చట్టాల అమలు కోసం మరో ఉద్యమం సాగించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో వాటికి సంబంధించిన చట్టం చేసేంత వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు యు టర్న్ తీసుకోవటమేంటని ప్రశ్నించారు. రైతులు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50శాతం కలిపి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ క్రీడలో మునిగిపోయాయని చెప్పారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఏఐకేఎస్‌సీసీ కన్వీనర్ పశ్య పద్మ మాట్లాడుతూ నిరంకుశ మోడీ ప్రభుత్వం రైతాంగ పోరాటానికి తలవంచిందని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరల చట్టం వచ్చేంత వరకు ఉద్యమం తప్పదని తెలిపారు. రాయల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉత్పత్తి ఖర్చులను అంచనా వేయటంలోనూ,మద్దతు ధరలు నిర్ణయించటంలోనూ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పారు.మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సాగిన ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావటం ఒక ప్రత్యేకతని చెప్పారు. అచ్యుత రామారావు, జక్కుల వెంకటయ్య, ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూసిన చూసిన మోడీకి భారత రైతాంగం తగిన బుద్ది చెప్పిందన్నారు. తెల్ల చట్టాల అమలు కోసం కూడా ఐక్య ఉద్యమాలు నిర్వహించక తప్పదన్నారు.ఈ మహాధర్నాకు సంఘీభావంగా సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య, వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, పీఓడబ్ల్యూ నేతలు ఝాన్సీ, సంద్య,మహిళా సమాఖ్య నేత జ్యోతి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, వృత్తి సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ తదితరులు మాట్లాడారు.