Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎంజే హాస్టల్లో విద్యార్థుల ఆందోళన
- సౌకర్యాలు సక్రమంగా లేవు
- నాణ్యత లేని బియ్యం, కుళ్ళిన కూరగాయలతో వంటలు
నవతెలంగాణ- అచ్చంపేట
నాసిరకం వంటలతో ఆకలితో అలమటిస్తున్నామని జేఎంజే హాస్టల్ విద్యా ర్థులు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల కేంద్రంలోని జేఎంజే హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం చేయకుండా హాస్టల్ పాఠశాల ఎదుట అందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలోని జేఎంజే హాస్టల్లో నాణ్యత లేని బియ్యం, కుళ్ళిన కూరగాయలతో వంటలు చేస్తున్నారనీ, కాలం చెల్లిన పచ్చళ్లు పెడుతున్నారని వాపోయారు. ప్రతిరోజు భోజనం ఒకే మాదిరిగా పెడుతున్నారని టీచర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదులతో పాటు టాయిలెట్లు, మరుగుదొడ్లు తామే శుభ్రం చేసుకుంటున్నామని తెలిపారు. అంతేకాదు, గ్రౌండ్ పరిసరాలు కూడా తామే శుభ్రం చేసుకుంటున్నామన్నారు. సౌకర్యాలు సక్రమంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ హస్టల్లో సౌకర్యాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.