Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటీసు ఇచ్చిన టీబీజీకేఎస్.. మద్దతు తెలిపిన సీఐటీయూ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. డిసెంబర్ 9 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) యాజమాన్యానికి గురువారం సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ మేరకు సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్‌కు సమ్మె నోటీసు ఇచ్చినట్టు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి వెంకట్రావు, మరియాల రాజిరెడ్డి తెలిపారు. కోల్‌ఇండియాలోని 89బ్లాకులతోపాటు సింగరేణిలోని నాలు గు బ్లాకుల ప్రయివేటీకరణను తక్షణం నిలుపుదల చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్‌కు చెందిన కళ్యాణ్ఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి బొగ్గు గనుల్ని వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు వారు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల సంస్థకూ, ఉద్యోగులకూ తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిని కాపాడుకోవడం కోసమే సమ్మెలోకి వెళ్తున్నట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలనీ, సింగరేణి యాజమాన్యం ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టాలని కోరారు.
సీఐటీయూ మద్దతు
టీబీజీకేఎస్ యూనియన్ యాజమాన్యానికి ఇచ్చిన సమ్మె నోటీసుపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు గురువారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికైనా గెలిచిన సంఘం అన్ని సంఘాలను కలుపుకొని వెళ్లాలని సూచించారు. పై డిమాండ్లతో పాటు మైన్ యాక్సిడెంట్లో ఎస్ఆర్పీ-3 లో చనిపోయిన కార్మికులకు కోటి రూపాయలు అదనపు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనీ, సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.13వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే సొంత ఇంటి నిర్మాణం కోసం ఒక్కో కుటుంబానికి 250 గజాల స్థలం, ఎవరు నివసిస్తున్న క్వార్టర్ వారికే కేటాయించాలనీ, సింగిల్ బెడ్ రూమ్ లను డబుల్ బెడ్ రూమ్‌లు గా మార్చాలని కోరారు. జేబీసీసీఐ అగ్రిమెంట్లలో అమలు కాని వివిధ క్యాడర్ స్కీములు, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు, కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాతో, యాక్సిడెంట్లో మరణించిన వారికి రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా, దిగిపోయిన వారికి మెడికల్ స్కీమ్ కింద ఒక్కొక్కరికి రూ.25 వేల రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాలని కోరారు. డిస్మిస్ కార్మికులను ఒకే దఫాగా తీసుకోవటంతో పాటు తదితర డిమాండ్లను కూడా సమ్మెనోటీసులో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.