Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములాఖాత్
- రైతాంగ పోరాటం అన్ని వర్గాల ప్రజలకు దిక్సూచి
- ఎమ్మెస్పీపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలి..
- తెలంగాణ ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి
- నవంబర్ 29న పార్లమెంటుకు ట్రాక్టర్ల ర్యాలీ : 'నవతెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూలో బీకేయూ నేత రాకేశ్ తికాయత్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహౌజ్వల రైతాంగ పోరాటాన్ని 'అద్దం'తో పోల్చారు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ నాయకులు రాకేశ్ తికాయత్. విద్యా ర్ధులు, కార్మికులు, యువతరం, ఉపా ధ్యాయులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలు ఆ అద్దం ముందు నిలబడి చూసుకుంటే, అది వారి ఉద్యమంగా, భవిష్యత్ తరాల దిక్సూచిగా కనిపిస్తుం దన్నారు. ఇది దేశంలోని ప్రతి ఒక్కరి ఉద్యమం అని విశ్లేషించారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) పిలుపులో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన 'నవతెలంగాణ' ప్రతినిధి ఎస్ఎస్ఆర్ శాస్త్రికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నవంబర్ 25వ తేదీకి ఢిల్లీలో రైతాంగ ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆ పోరాట ప్రస్థానం, కేంద్ర ప్రభుత్వ నిర్బంధం, భవిష్యత్ పోరాటాలు, సాధించాల్సిన లక్ష్యాలు సహా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం అమల్లోకి తేవాలని డిమాండ్ చేసిన ఆయన ఇంటర్వూ విశేషాలు...
ఓ డిమాండ్ సాధనకు ఇంతటి సుదీర్ఘ పోరాటం అవసరమా?
ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఉంటే ఇంతటి సుదీర్ఘ పోరాటా లు అవసరం లేదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, హక్కుల హననానికి పాల్పడుతున్నాయి కాబట్టే అవసర మైంది. ఇంతకాలం ఈ పోరాటం సాగుతుందని మేమూ ఊహించలేదు. ఇది రైతుల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన ఉద్యమం. వారే దాన్ని కొనసాగించారు. పాక్షిక విజయాన్ని సాధించారు. కేంద్రంలో పెద్ద పెద్ద చదువులు చదివినోళ్లు ఉన్నారు. వాళ్లకు మా బాధ, భాష, భావం అర్థం కావడానికి పది నెలలకు పైగా సమయం పట్టినట్టే భావిస్తున్నాం.
మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం అంగీకరించింది కదా..ఉద్యమాన్ని విరమిస్తారా?
సమస్యే లేదు. ఈ ఉద్యమం మరింత పోరాట స్ఫూర్తిని రగిల్చింది. దేశ రైతాంగ మనుగడ కోసం సాధించుకోవాల్సిన అనేక డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి. వాటికోసం ఉద్యమం కొనసాగుతుంది. అదేసమయంలో కేంద్ర ప్రభు త్వంతో చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆహ్వానించా ల్సింది వారే...
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనీ, దళారుల నుంచి రక్షణ కల్పిస్తున్నామనీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది కదా? ఇక మీ పోరాటాల అవసరం ఏముంది?
మా పోరాటాల వల్లే ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే వాస్తవాన్ని గ్రహించాలి. ప్రభుత్వానికి అంతటి విశాల దృక్పధమే ఉంటే, చట్టాలు రైతు సంక్షేమానికి ఉద్దేశించినవే అయితే, వాటి రద్దును ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? అదంతా తప్పుడు ప్రచారం. మేం ఒకే ప్రశ్నకు కేంద్రం నుంచి సూటిగా సమాధానాన్ని కోరుతున్నాం. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) చట్టంపై మీ అభిప్రాయం ఏంటి? అది రైతులకు మేలు చేస్తుందా..లేదా? దానిపై స్పందించండి. అది సాధించాలంటే ఇదే స్ఫూర్తితో భవిష్యత్ ప్రజాందోళనా పోరాటాలు అవశ్యం.
నవంబర్ 29న మళ్లీ పార్లమెంటుకు ట్రాక్టర్ల ర్యాలీ చేస్తామని ప్రకటించారు. ఇది ప్రభుత్వంపై తిరుగుబాటా?
కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) డిమాండ్ సాధన కోసం రెట్టించిన ఉత్సాహంతో మేం ఉద్యమిస్తున్నాం. ట్రాక్టర్ల ర్యాలీ మా నిరసనల్లో భాగమే. మేం చట్టాలను అతిక్రమించం. ప్రభుత్వం అనుమతించిన మార్గాలు, రహదారుల నుంచే పార్లమెంటుకు వెళ్తాం. రోడ్లు ఓపెన్ చేస్తారా...మూసేస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి.
కేంద్రం చర్చలకు పిలిచిందా?
లేదు. పిలిస్తే వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అనేక అంశాలు పరస్పరం చర్చించుకుంటేనే పరిష్కారమవుతాయి.
కేంద్రప్రభుత్వ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన ప్రభావం త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుందా?
ఆ విషయం ఇప్పుడే చెప్పలేం. కనీస మద్దతు ధర (ఎమెస్పీ) చట్టం వచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుంది.
రైతు ఉద్యమంలో మరణించిన 750 మంది రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది కదా...దీన్నెలా చూస్తారు?
కచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. మంచి నిర్ణయం. కేంద్రం కూడా బాధ్యత తీసుకోవాలి.
రైతాంగ ఉద్యమం ఉత్తరాదికి మాత్రమే పరిమితమనే ప్రచారం జరిగింది. దక్షిణాది రైతాంగాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకపోయారు?
అలాంటిదేం లేదు. దక్షిణాది రైతులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అదంతా కేంద్ర ప్రభుత్వ దుష్ప్రచారం. ఢిల్లీ అందోళనల్లో అక్కడి చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాల ప్రజలే ఉన్నారని ప్రచారం చేసింది. కానీ ఏం జరిగిందో ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసింది కదా? మేం ఇక్కడా సభలు పెడతాం. క్షేత్రస్థాయి నుంచి మరింత మద్దతు కూడగడతాం. దానిలో భాగమే ఇప్పుడిక్కడి మహాధర్నా.
ఢిల్లీ రైతాంగ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికారపార్టీ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ప్రభుత్వం తరఫున మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీన్నెలా అర్థం చేసుకోవాలి?
తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నారు. ఇవి మంచి నిర్ణయాలు. వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై కేంద్రం ఎందుకు ముందుకు రావట్లేదో ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం వారిపైనే ఉంది.