Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువనగిరి పట్టణం ముస్తాబు
- ముఖ్యఅతిధిగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం ముస్తాబైంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 200 మంది ప్రతినిధులు, 50 మంది ఆహ్వానితులు హాజరుకానున్నారు. శనివారం జరిగే జేవీవీ రాష్ట్ర మహాసభల ప్రారంభసభకు ముఖ్యఅతిధిగా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ మోహన్‌రావు హాజరవుతారు. ఆయన సైన్స్, అభివృద్ధి అనే అంశంపై ప్రసంగిస్తారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, నిమ్స్ మాజీ డైరెక్టర్ దాసరి ప్రసాదరావు 'ప్రజాసైన్స్ ఉద్యమంలో జేవీవీ కృషి'అనే అంశంపై మాట్లాడతారు. ఆదివారం 'కులం-మతం, డీఎన్ఏ పరిశీధనలు'అనే అంశంపై సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్ తంగరాజు, 'ప్రస్తుత పరిస్థితుల్లో జేవీవీ ఎలాంటి పాత్ర పోషించాలి'అనే అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్ ప్రసంగిస్తారు. ఆదివారం జేవీవీ రాష్ట్ర నూతన కమిటీని ప్రతినిధులు ఎన్నుకుంటారు.
మూఢనమ్మకాల నిరోధక చట్టం కోసం విస్తృత ప్రచారం
మూఢనమ్మకాల నిరోధక చట్టం కోసం జేవీవీ రాష్ట్ర కమిటీ విస్తృత ప్రచారం చేసింది. రాష్ట్రంలో నమోదైన ఎనిమిది బాణామతి దుర్ఘటనల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేసింది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పెరిగిన ఒత్తిడితో ఆ తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించేలా చేసింది. అందరికీ ఆరోగ్యం డిమాండ్‌తో జాతీయ ఆరోగ్య సదస్సును దేశవ్యాప్తంగా 200 మంది డాక్టర్లతో నిర్వహించింది. ప్రజావైద్యం ప్రభుత్వ బాధ్యత అనే నినాదాన్ని రాష్ట్రమంతా ప్రచారం చేపట్టింది. కూల్డ్రింక్స అనుకూల ప్రకటనలను సినీనటులు ఆపివేయాలని బహిరంగలేఖ రాసింది. పర్యావరణ రంగంలో అమెరికా విధానానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతి గ్రహీతలతోపాటు, అనేక మంది శాస్త్రవేత్తలు ఇచ్చిన పిలుపు మేరకు మార్ఛ్ ఫర్ సైన్స్ కార్యక్రమాలు నిర్వహించింది. విద్యార్థులకు బాలమేళాలు జరిపింది. భారత సైన్స్ కాంగ్రెస్‌లో సూడో సైన్స్ ప్రచారాన్ని నిరసిస్తూ ప్రచారం చేపట్టింది. సైన్స్-సాహిత్య జమిలి కార్యక్రమాల నిర్వహణ, కళోజీ, భాగ్యరెడ్డివర్మ కృషిని వివరిస్తూ గోడ పత్రికల ద్వారా విస్తృతంగా పంపిణీ చేసింది. సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేషంగా కృషి చేసింది.
ప్రభుత్వరంగంలోనే వైద్యం ఉండాలి : వరప్రసాద్
ప్రభుత్వరంగంలోనే వైద్యరంగం ఉండాలని జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజావైద్యం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కానీ ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకుందని విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులే ప్రజల ప్రాణాలను కాపాడాయని గుర్తు చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు చేతులెత్తేశాయనీ, డబ్బున్నోళ్లకే చికిత్స అందించాయని చెప్పారు. ప్రజావైద్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని కోరారు. నూతన విద్యావిధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ద్వారా 33 శాతం నుంచి 50 శాతం సీట్లను అమ్ముకునేందుకు యాజమాన్యాలకు అవకాశం కల్పించిందని చెప్పారు. పేద విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కమిటీలు వేయాలని గత మహాసభలో కర్తవ్యంగా తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం 32 జిల్లాల్లో పూర్తి చేశామనీ, వారం రోజుల్లో మిగిలిన జిల్లా కమిటీని వేస్తామని వివరించారు. 102 మండలాల్లోనూ కమిటీలున్నాయని అన్నారు.