Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంతపార్టీ వారిపై అపనమ్మకంతో టీఆర్ఎస్
- పుట్టిముంచుతారేమోనని ముందుగానే అప్రమత్తం
- ఆయా పార్టీల కార్యాలయాల చుట్టూ చక్కర్లు
- ప్రత్యర్థి అభ్యర్థులకు సైతం బంఫర్ ఆఫర్లు!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది. బలం ఉంది.. బలగం ఉంది.. చేతిలో అధికారం ఉంది.. అయినా ఆ పార్టీ నేతలు ఎందుకు ఆయా పార్టీల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు? రహస్య మంతనాలు జరుపుతున్నారు? కారణం సొంత పార్టీ నేతలు, ఓటర్లు ఎక్కడ పుట్టిముచ్చుతారోనన్న అపనమ్మకమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓవైపు విధులు, నిధులు లేవని మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీలు) గగ్గోలు పెడుతున్నారు. అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. లక్షలు లక్షలు కుమ్మరించి గెలిస్తే ప్రభుత్వ విధానాల కారణంగా అలంకారప్రాయంగా మారిన పదవిని తలచుకొని ఆవదన చెందుతున్నారు. ఈ క్రమంలో వారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ఓ ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారు. మరోవైపు సొంతపార్టీలో కుంపట్లు టీఆర్ఎస్ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని అనూహ్యంగా అధిష్టానం తాతా మధుసూదన్‌కు టిక్కెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు నేతల కనుసన్నల్లో నడుచుకునే స్థానిక సంస్థల ఓటర్లు వందల సంఖ్యలో ఉన్నారు. వీరికి తోడు ఎమ్మెల్సీ ఆశావహుల్లో ఒకరిగా పేరు వినిపించిన గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర)కి కూడా ఎంతోకొంత బలం ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపుతో పాటు భారీ మెజార్టీ సాధించడం అభ్యర్థి తాతా మధుతో పాటు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, రైతుబంధు సమతి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డికి సవాల్ లాంటిది.
గెలుపు కోసం పాచికలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా భారీ మెజార్టీతో గెలిచితీరకపోతే అధినేత వద్ద తమ ప్రతిష్ట దిగుజారుతుందనే తలంపుతో ఉన్న టీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సొంత పార్టీ ఓటర్లు హ్యాండిచ్చినా పొరుగు పార్టీలతో గట్టెక్కాలనే ఆలోచనతో ఆయా పార్టీల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సీపీఐ కార్యాలయ తలుపులను మరోమారు తట్టారు. సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ ఆఫీస్‌ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అభ్యర్థి వామపక్ష నేపథ్యాన్ని చూపించి.. తమ గెలుపునకు సహాయపడాలని వేడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు మొత్తం 769 మంది ఉండగా.. దీనిలో 500 మందికి పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే. ఓ 60 మంది వరకు స్వతంత్ర ఓటర్లు, సీపీఐ(ఎం), సీపీఐ చెరి 30 మంది చొప్పున ఉండగా.. టీడీపీకి 19, ఎన్డీకి 15 మంది ఓటర్లు ఉన్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారనే భయంకొద్దీ టీఆర్ఎస్ నేతలు అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్నట్లు వినికిడి.
ప్రత్యర్థి అభ్యర్థులకూ బంఫర్ ఆఫర్లు!
ప్రత్యర్థి అభ్యర్థులతో రాజీ కుదుర్చుకుంటే గెలుపు అవకాశాలు మరింత మెరుగువుతాయనే కోణంలోనూ అధికార పార్టీ పావులు కదుపుతోంది. వారిని ఆకట్టుకునే పనిలో పడింది. నామినేషన్లు ఉపసంహరించుకుంటే బంఫర్ ఆఫర్లు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఎంపీటీసీలకు నిధులు, విధుల కోసం బరిలోకి దిగిన కల్లూరు మండలం పేరువంచ ఎంపీటీసీ కొండపల్లి శ్రీనివాసరావుకు రూ.లక్షల్లో ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. కానీ అందుకు ఆయన ప్రస్తుతానికి సుముఖత వ్యక్తం చేయనట్టు తెలుస్తోంది. సుమారు 15 ఆదివాసి సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న మరో స్వతంత్ర అభ్యర్థి, ఎంపీటీసీ కొండ్రు సుధారాణికి సైతం ఇలాంటి ఆఫరే ఇచ్చినట్టు తెలిసింది. ఆమెకు సర్దిచెప్పి విత్‌డ్రా చేయించే బాధ్యత సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు అప్పగించినట్టు సమాచారం. టిక్కెట్ దక్కక నైరాశ్యంలో ఉన్న ఆయన ఏమేరకు మనస్ఫూర్తిగా ఈ పనిని పూర్తి చేస్తారో తెలియదు కానీ ఇప్పటికైతే సుధారాణి పోటీకే సై అంటున్నారు. ఇదంతా ఒకెత్తయితే 115 ఓట్లకు పైగా బలం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు సైతం అధికార పార్టీ నేతలు భారీ బంఫర్ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఆయనను రూ.8 కోట్లు ఎరగా చూపించినా.. ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్టు సమాచారం. ఇలా బలం ఉన్నా.. బలహీనతలు వెంటాడుతుండటంతో టీఆర్ఎస్ పడరానిపాట్లు పడుతుండటం చర్చనీయాంశంగా మారింది.