Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు చిత్తశుద్ధిపై అనుమానాలు
- మొక్కుబడిగా దరఖాస్తుల స్వీకరణ
- తక్కువ చేసి చూపేందుకు యత్నాలు
- పట్టాలందేది డౌటే..! అందినా కొందరికే..!!
ఖమ్మం జిల్లా ఏజెన్సీ నుంచి కె.శ్రీనివాసరెడ్డి
పోడు పట్టాల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిపై సందేహాలు తలెత్తుతున్నాయి. కొద్దిమందికి హక్కుపత్రాలు ఇచ్చి చేతులు దులుపుకోవడమో...! లేదంటే వివిధ కార ణాల పేరుతో పట్టాల పంపిణీ ప్రక్రియ నిలిపివేయడమో..!! అన్న రీతిలో సర్కారు వ్యవహార శైలి ఉందని పోడుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యమాల ఫలితంగా తప్పనిసరి స్థితిలో ప్రభుత్వం హక్కుపత్రాల పంపిణీకి ఆమోదం తెలిపినా.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మొక్కుబడిగా ముగించింది. ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు పదిరోజుల పాటు దరఖా స్తులు స్వీకరణ జరిగింది. 'హక్కుపత్రాలు కూడా ధాన్యం కొనుగోళ్ల తరహాలోనేనా..!' అని ఓ గిరిజనుడు మణుగూరు మండలం పగిడేరు పంచాయతీలో గ్రామసభ నిర్వహణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ నెలలో అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహించిన సడఖ్ బంద్‌తో ప్రభుత్వం దిగివచ్చింది. హక్కు పత్రాల పంపిణీకి సిద్ధపడింది. తొలుత 2005కు ముందున్న వాళ్లవి, ఆ తర్వాత వచ్చిన వాళ్ల దరఖాస్తులు స్వీకరిస్తామ న్నారు. ఇప్పుడు 2005కు ముందున్న ఆక్రమణదారులవి మాత్రమే తీసుకున్నారు. వ్యక్తిగత హక్కు ఫారం-ఏ, ఉమ్మడి హక్కు ఫారం-బీ పేరుతో దరఖాస్తులు స్వీకరించారు. ఫారం-బీ పరిధిలోని శ్మశానం, పాఠశాలలు, ఇతరత్ర వసతుల కల్పన కోసం ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించలేదు. ఫారం-ఏ దరఖా స్తులూ చాలా స్వల్పంగా తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పోడు భూముల సమస్య అధికంగా ఉందంటున్నారు. కానీ ఆ మండలంలో 146 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. దరఖాస్తులపై అవగాహన బదులు దరఖాస్తు చేసుకోకుండా వివిధ రకాల అభ్యంత రాలు పెట్టడమంటేనే.. దీని విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందన్నది తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వంద ఎకరాల్లో పోడుసాగు చేస్తుంటే ఐదారు ఎకరా లకు హక్కుపత్రాలిస్తామంటూ మిగతా మొత్తాన్ని తమకు వదిలేయాల్సిందిగా ఫారెస్టు అధికారులు ఆదివాసీలతో బేరసారాలు చేసినట్టు తెలిసింది.
నెలరోజులు దరఖాస్తుల స్వీకరణ అని పదిరోజులకే మమ
నవంబర్ 8 నుంచి నెలరోజుల పాటు డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు తీసుకుంటామని మొదట్లో చెప్పి.. ఈనెల 18వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియను ముగించారు. దీనిపై ప్రశ్నిస్తే దరఖాస్తుదారులెవరూ ముందుకు రాలేదన్నది ప్రభుత్వ అధికారుల సమాధానం. గట్టిగా ప్రశ్నిస్తే డిసెంబర్ 8వ తేదీ వరకు తీసుకుంటామంటున్నారు. కులం సర్టిఫికెట్ అవసరం లేకున్నా దానికోసం అధికారులు పట్టుబట్టారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తే కుల ధ్రువీకరణ ఇవ్వట్లేదు. కొన్నిచోట్ల పట్టాలిప్పిస్తామని ఫారెస్టు అధికారులు ఎకరానికి రూ. 2,000 చొప్పున వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గిరిజనేతరులు మాత్రం 75 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నట్టు ధ్రువీకరణ చూపించాల్సి ఉంటుంది. మొత్తం 13 రకాల ఆధారాలలో ఏ రెండు జత చేసినా సరిపోతుంది. చట్టంలోని సెక్షన్-11 ప్రకారం నోడల్ ఏజెన్సీ (గిరిజన సంక్షేమశాఖ) ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిర్వహించాలి. కానీ ఈ శాఖ అధికారులు ఎక్కడా కనిపించ డం లేదు. 1967 ఆంధ్రప్రదేశ్ అటవీహక్కు చట్ట ప్రకారం సెక్షన్-4 కింద రిజర్వ్ ఫారెస్టుగా ప్రకటించక ముందు నుంచే అటవీ భూములను రైతులు పోడు చేసుకున్నారు. కాబట్టి వారి హక్కులను గుర్తించాలని ఏపీ అటవీహక్కు చట్టంలో ఉంది. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోగా అడవి లోపల ఉంటున్న ఆదివాసీలను బయటకు పంపి ప్రభుత్వ భూములను కేటాయిస్తామంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో కొనేరు రంగారావు కమిటీ 25 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్టు భూమిని గుర్తించింది. దీనిలో మూడు లక్షల ఎకరాలకు అప్పటి ప్రభుత్వం హక్కుపత్రాలు ఇచ్చింది. ఇప్పుడీ ప్రభుత్వం వాటన్నింటినీ కొట్టిపారేస్తోందని సంఘాల నేతలు తెలిపారు.
కనిపించని ఎఫ్ఆర్సీ కమిటీలు...
వాస్తవానికి ఎఫ్ఆర్సీ కమిటీలు దరఖాస్తులు తీసుకో వాలి. వీఆర్వోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు దరఖా స్తులు తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 5వ తేదీన గిరిజన శాఖ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పరిశీలన కమిటీని ఏర్పాటు చేస్తారట.. రెవెన్యూ, అటవీ, గిరిజన శాఖల నుంచి ఒక్కొక్కరు చొప్పున నియమించి పరిశీలన కమిటీలు ఏర్పాటు చేస్తామనడంపైనా అభ్యంతరాలు వస్తున్నాయి. కుటుంబానికి పది ఎకరాల వరకు హక్కు ఇవ్వవచ్చని, పోడుదారులపై కేసులు ఎత్తివేయాలని చట్టం చెబుతోంది. కానీ ప్రభుత్వం హరితహారం పేరుతో దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. సెక్షన్ 8(5) ప్రకారం ఏ హక్కుదారున్నీ తొలగించరాదు. హరితహారం ముందుకెళ్లాలనే తలంపుతో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రిజర్వ్‌ఫారెస్టుల్లో ఉన్న ఆదివాసీ గ్రామాల ప్రజలను బయటకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం గ్రామసభకు విలువలేకుండా అధికారయంత్రాంగం ద్వారా దరఖాస్తుల ప్రక్రియ చేపట్టాలంటోంది. నాలుగు దశల్లో దరఖాస్తుల పరిశీలన చేసి వీలైన మేరకు దరఖాస్తుదారుల సంఖ్యను తగ్గించాలనే యత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలంగాణ గిరిజన, ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
నిష్పక్షపాతంగా దరఖాస్తులు స్వీకరించాలి
పోడుదారుల దరఖాస్తుల గడువు తేదీని మూడు నెలల పాటు పొడగించడంతో పాటు నిష్పక్షపాతంగా దరఖాస్తులు స్వీకరించాలి. గ్రామ సభ ద్వారానే దరఖాస్తుల నమోదు ప్రక్రియ చేపట్టాలి. పట్టాలు, పరిశీలన అన్నీ లబ్ధిదారుల సమక్షంలో జరపాలి. అధికారులు అవినీతిని అరికట్టాలి. డిసెంబర్ 13, 2005 కాకుండా జూన్ 2014 వరకు ఉన్న పోడుదారులకు హక్కు కల్పించేలా శాసనసభలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పార్లమెంట్లో చేసిన చట్టానికి శాసనసభలో తీర్మానం ఎలా చేస్తారు? తలాతోక లేకుండా ప్రభుత్వ వ్యవహారశైలి ఉంది. ప్రభుత్వం మభ్య పెట్టే చర్యలను నిలువరించి చట్టాల స్ఫూర్తి దెబ్బతినకుండా పోడుదారులందరికీ పట్టాలివ్వాలనేది మా డిమాండ్.
- మిడియం బాబూరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
వివిధ జిల్లాల్లో పోడుభూములు (ఎకరాలు), దరఖాస్తులు
జిల్లా ఎస్టీ+నాన్‌ఎస్‌టీ దరఖాస్తులు భూములు
భద్రాద్రి కొత్తగూడెం 63,037+17,901 80,938 2,29,343.38
ఖమ్మం 8,656+8,125 16,781 39,631.23
జగిత్యాల 1,342+3,382 4,724 9,018.37
పెద్దపల్లి 482+ 4,032 4,614 8,298
రాజన్న సిరిసిల్ల 2,842+3,097 5,939 14,013.23
ఆదిలాబాద్ 9,847+6,814 16,661 62,266
కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ : 45,000 దరఖాస్తులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ : 6,520 దరఖాస్తులు
రంగారెడ్డి 970 ఎకరాలకు గాను 1074 దరఖాస్తులు
వికారాబాద్ 23,000 ఎకరాలకు 600 దరఖాస్తులు