Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలి, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలి
- రైతు పోరాట స్ఫూర్తితో కార్మికవర్గం ఐక్య పోరాటాలు : చుక్క రాములు
- రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ-పటాన్చెరు/ విలేకరులు
సాగుచట్టాల రద్దు కోసం ఏడాది కాలంగా రైతులు.. కేంద్ర పాలకులపై పోరాడి విజయం సాధించడం గొప్ప విషయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. రైతు ఉద్యమం ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన విజయ్ దివాస్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రా మివాడలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యాన కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. భారత జాతీయోధ్యమం తర్వాత అంతటి స్థాయిలో.. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో రైతులు కరోనా మహమ్మారి, చలి, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వీరోచితంగా చేస్తున్న పోరాటం ఏడాది పూర్తి చేసుకున్నదని గుర్తు చేశారు. ఇది కార్మిక కర్షక విజయమన్నారు. ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని, కానీ రైతు సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రధాని ప్రకటన చేయడం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని సూచిస్తున్నదని విమర్శించారు. ఇవే కాక అనేక రైతుల డిమాండ్లు పరిష్కరించాల్సి ఉందని, కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాలని, విద్యుత్ సవరణల బిల్లును ఉపసంహరిం చుకోవాలని.. ఈ పోరాటంలో అమరులైన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషి యా చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ ఉద్యమం కొనసాగు తుందని రైతు సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో సీఐటీయూగా ఈ పోరాటానికి అండగా ఉంటామన్నారు. రైతు పోరాట స్పూర్తితో భారత కార్మికవర్గం జెండాలకు అతీతంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాడాలన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవడానికి కార్మిక వర్గం ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. మోడీ మెడలు వంచి పోరాడిన చరిత్ర రైతులదని సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేశారు. నల్లగొండలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, సూర్యాపేటలో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.