Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
- మృతుల్లో ముగ్గురు సోదరులు
నవతెలంగాణ - మానకొండూర్
అతివేగంతో పోతున్న ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢ కొట్టడంతో నలుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతులు కరీంనగర్లోని జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారిలో కొప్పుల శ్రీనివాస్ రావు(57) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీఆర్ ఈఈగా విధులు నిర్వహిస్తున్నాడు. కొప్పుల బాలాజీ శ్రీధర్(55) పెద్దపల్లిలో న్యాయవాది. కొప్పుల శ్రీరాజ్(53) ఆర్కిటెక్ ఇంజినీరు, కారు డ్రైవర్ ఇందూరి జలందర్(28). తీవ్రంగా గాయపడిన వ్యక్తి పెంచాల సుధాకర్ రావు(56). వీరంతా ఖమ్మం జిల్లాలోని కల్లూరులో దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు బావిస్తున్నారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.