Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పక్క రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి గంజాయి స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగటంపై డీజీపీ మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముఖ్యంగా, వైజాగ్ నుంచి తరలివస్తున్న గంజాయి హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా కావడం పట్ల ఆయన తీవ్రంగా పరిగణించారు. వైజాగ్ నుంచి గురువారం లారీల్లో తరలివచ్చిన ఒక లారీలో దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఇదే విధంగా, గత నెల రోజుల్లో దాదాపు రూ. 10 కోట్ల విలువైన గంజాయిని రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి హైదరాబాద్కు చేరుకున్న తర్వాతే పట్టుబడటం పట్ల డీజీపీ.. అధికారులతో మాట్లాడుతూ విస్మయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. వైజాగ్ నుంచి తెలంగాణ సరిహద్దులు దాటి గంజాయి లారీలు నిరాటంకంగా హైదరాబాద్ మీదుగా ఏ విధంగా పోతున్నాయని ఆయన అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలనీ, తెలంగాణ సరిహద్దుల నుంచి హైదరాబాద్ వరకు వచ్చే మార్గంలోని వివిధ జిల్లాల పోలీసు అధికారులు ఇకపై అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది. ముఖ్యంగా, వైజాగ్ నుంచి తెలంగాణ సరిహద్దుల్లోకి గంజాయి స్మగ్లింగ్ లారీలు చేరుకున్నప్పుడే వాటిని అక్కడే పట్టుకునేలా స్పెషల్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేయాలని ఆయన కోరినట్టు తెలిసింది. లేకపోతే, ప్రజల్లో.. ఈ గంజాయి స్మగ్లింగ్ సాగటం పట్ల అధికార యంత్రాంగంపై అనుమానాలు పెరిగే అకాశమున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. రూ. 3 కోట్లకు పైగా విలువైన గంజాయిని పట్టుకోవటం పట్ల రాచకొండ పోలీసులను డీజీపీ అభినందించారు.