Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన గురుకులాల్లో పేద వర్గాలకు నాణ్యమైన విద్య అందుతున్నదని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం చేస్తోందనీ, ల్యాప్ టాప్లను అందిస్తున్నదని పేర్కొన్నారు. గిరిజన గురుకులాల విద్యార్థులకు ఐఐటీ, ఎన్.ఐ.టీలలో ట్యూషన్ ఫీజ్ మినహాయింపు ఉందనీ, స్కాలర్ షిప్ కూడా వస్తుందని తెలిపారు. నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీట్లు పొందుతున్నారని, వీరికి ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో చదివితే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద 20 లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న పేదరికాన్ని శాశ్వతంగా తొలగించాలంటే నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని భావించి, గతంలో ఎప్పుడూ లేనన్ని గురుకులాలు పెట్టామని తెలిపారు. కేజీ టు పీజి ఉచిత విద్య ద్వారా అన్ని వర్గాల పేద బిడ్డలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు.