Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వరి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట కొనే దిక్కులేక అగోరిస్తున్నారని తెలిపారు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని పేర్కొన్నారు. వరిధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగంతో ఆటలాడుకోవద్దని హెచ్చరించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ, కొన్న వాటికి వెంటనే ప్రభుత్వం కాటాలు వేసి రవాణా చేయాలని తెలిపారు. ఈనెల 28న కల్లాలను సందర్శించాలని రైతుకూలీ నాయకులను కోరారు. రైతుకు అండగా నిలబడాలని సూచించారు. కేంద్రంపై నెపంనెట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోజూస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీదకే కేంద్రం నెడుతున్నదని తెలిపారు. ఫలితంగా రైతు నష్టపోతున్నారని వివరించారు. రెండు ప్రభుత్వాలు డ్రామాలు ఆపాలనీ, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.