Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనీ, 1996 కేంద్ర చట్టం. 1979 అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టాల రద్దును ఆపి భవన నిర్మాణ రంగ వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ రెండు, మూడు తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్టు తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగూరు రాములు, ఆర్.కోటంరాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో తేదీన మండల కేంద్రాల్లో ప్రదర్శనలు చేపట్టి తహసీల్దార్లకు, మూడో తేదీన జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. రెండు రోజుల సమ్మెను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికులకు పిలుపునిచ్చారు. 1998 సెస్సు చట్టం, రాష్ట్రాలలో వెల్ఫేర్ బోర్డుల వల్ల భవన నిర్మాణ కార్మికుల మరణాలకు పరిహారాలు, పెండ్లి కానుకలు, ప్రసూతి సదుపాయాలు, తదితర సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వాటిని నిర్వీర్యం చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నుంచి అక్రమంగా తరలించిన రూ.1,005 కోట్లను తిరిగి అందులో జమచేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్‌లకు నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ శ్రమ్ స్కీమ్‌లో భవన నిర్మాణ కార్మికులందరి పేర్లనూ నమోదు చేయించాలని సూచించారు.