Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగం బాధలు వర్ణనాతీతం..
- మద్దతు ధరపై ఆశలు వదులుకొని రూ.1000కే అమ్మకం
- ఎమ్మెల్సీ ఎన్నికలపై వామపక్షాలు,
టీడీపీ నేతలతో చర్చిస్తున్నాం..:
కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్రాలు నాటకాలాడుతున్నాయని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వానాకాలం వడ్డు కొనమంటే టీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి వడ్ల గురించి హడావుడి చేస్తుండటం విస్తుగొల్పుతుందన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గొకినేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఖమ్మంలోని ఓ రిసార్ట్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. ధాన్యం కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఇంటిల్లిపాది వడ్ల రాశుల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని తెలిపారు. వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తి పనికిరాకుండా పోతాయనే భయాందోళనతో రైతులు మద్దతు ధర క్వింటాల్ రూ.1960పై ఆశలు వదులుకుని రూ.1050కే తెగనమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీకి పోయి యుద్ధం చేస్తామని చెప్పిన సీఎం రాశులుగా పోసి ఉన్న వానాకాలం వడ్లను వదిలి యాసంగి ధాన్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసికట్టుగా నాటకాలాడుతుండటంలో కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టాలనే కుట్ర దాగుందన్నారు. గిట్టుబాటు ధర లభించక రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తే.. ఆ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టొచ్చనే కుట్రపూరిత ఆలోచన దాగుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు గెలుపు కోసం సీపీఐ(ఎం), సీపీఐ, వామపక్ష పార్టీలు, టీడీపీ రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ చర్చలు కొలిక్కి వస్తాయని తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విధులు, నిధులు లేకుండా నిర్వీర్యం చేసిన టీఆర్ఎస్కు బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోట్ల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు రామసహాయం మాధవిరెడ్డి, మంజుల, నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావీద్ తదితరులు పాల్గొన్నారు.