Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కరీంనగర్ టౌన్
టీఆర్ఎస్ పతనం కరీంనగర్ నుంచే మొదలైందని కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. శనివారం కరీంనగర్ నగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను నీతి, నిబద్ధత, నిజాయితీ అనే ట్యాగ్ లైన్లతో టీఆర్ఎస్లో చేరి ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకువెళ్లటంలో ఎంతగానో కృషి చేసినట్టు తెలిపారు. 2006లో అప్పటి ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌తో అర్జునగుట్టకు వెళ్లిన సందర్భంగా.. ఆ దేవుడి సాక్షిగా ఎమ్మెల్సీ అవకాశమిస్తానని చెప్పారని, ఆ తర్వాత మరో మూడు సందర్భాల్లో కూడా అడగకున్నా హామీ ఇచ్చారని తెలిపారు. మేయర్ పదవి అడగలేదని, ఎమ్మెల్సీ మాత్రమే అడిగితే.. ఈసారి నీకేనంటూ చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే స్వతంత్రంగా బరిలోకి దిగినట్టు స్పష్టం చేశారు. తన నామినేషన్ కూడా తిరస్కరించే కుట్రలు చేసినప్పుడే నైతిక విజయం సాధించానన్నారు. స్మార్ట్ సిటీ కోసం ఎంతగానో శ్రమించి నిధులు తెస్తే, నాసీరకం పనులతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిలో భానుప్రసాద్ రావు గురించి అందరికీ తెలుసని, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉండి 12ఏండ్లలో ఎన్నిసార్లు జిల్లాలో స్థానిక సంస్థల సమస్యలపై ఉద్యమించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏనాడూ స్థానిక సంస్థల అభివృద్ధి, ప్రాదేశిక సభ్యుల సమస్యలు పట్టించుకోని భాను ప్రసాద్ ఏ ముఖంతో ఓట్లడుగుతారని ప్రశ్నించారు. వాళ్లు గెలిస్తే హైదరాబాద్‌కే పరిమితమవుతారని, తమ వ్యాపారాల అభివృద్ధి కోసమే పదవిని ఉపయోగించుకుంటారని అన్నారు. తాను గెలిస్తే కరీంనగర్లో కార్యాలయం ఏర్పాటు చేసి, ప్రాదేశిక సభ్యులకు ఆరోగ్య కార్డులు అందించే కృషి చేస్తానని ప్రకటించారు. సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో పదవులు కేటాయిస్తున్నట్టు చెబుతున్న ముఖ్యమంత్రి, ఉద్యమ కాలంలో సామాజిక సమీకరణ ఆధారంగా ఆందోళనలు చేశారా? అని ప్రశ్నించారు. పదవులకు పాకులాడేదేవరో ప్రజలకు తెలుసని, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ కవితలకు ఓడిపోయిన వెంటనే పదవులు కట్టబెట్టడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఉద్యమానికి ముందు కూడా తాను ప్రజాప్రతినిధిగా గెలిచిన విషయం గుర్తుచేశారు. టీఆర్‌ఎస్సేతర పార్టీలన్నీ తనకే మద్దతు తెలుపుతున్నాయని, భారీ మెజార్టీతో గెలుస్తాననే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు మండల ప్రాదేశిక సభ్యులు పాల్గొన్నారు.