Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక పోరాట మార్గాలే శరణ్యం
- బడా పెట్టుబడిదారులకు బీజేపీ కొమ్ము కాస్తోంది
- వరిపంట కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలడుతున్నాయి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- ఘనంగా పార్టీ సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభలు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వాలతో ప్రజలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారనీ, ప్రస్తుత పరిస్థితులపై పోరాట మార్గామే శరణ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివమ్స్ గార్డెన్లో శనివారం నిర్వహించిన ఆ పార్టీ జిల్లా ద్వితీయ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ సాధారణ రాజకీయ పార్టీ మాత్రమే కాదనీ, దేశంలో మతోన్మాదాన్ని, ఫాసిస్ట్ వ్యవస్థను, కార్పొరేట్ పెట్టుబడిదారులను పెంచి పోషించే పార్టీ అని అన్నారు. బీసీలు, మైనార్టీలకు ద్రోహం తలపెడుతూ.. హిందూ ఉన్మాద పార్టీగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలందరూ కలిసికట్టుగా పోరాటం చేసి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. సోషలిస్టు పార్టీ అధికారంలో ఉన్న దేశాల్లో కరోనాను కట్టడి చేయడంలో విజయవంతమయ్యారన్నారు. సమస్యలపై చర్చిస్తానని చెప్పి కేసీఆర్ ఢిల్లీకి పోయి వచ్చాడు తప్పా చేసిందేమీ లేదన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల జీవితాలతో ఆటలు ఆడటం ఆపి.. పంటను వెంటనే కొనుగోలు చేయాలని తెలిపారు. రాష్ట్ర విభజన హామీలపై కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి దిగాలని సూచించారు.
వీర తెలంగాణ నాటకం ప్రదర్శన..
అంతకుముందు ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో వీర తెలంగాణ నాటకాన్ని ప్రదర్శించారు. నాటి నైజాంకు, భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాటాన్ని నాటకంలో కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు. మహాసభల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు యాదవరెడ్డి, గోపాలస్వామి, శశిధర్, కళావతి, యాదగిరి, భాస్కర్, ఎల్లయ్య, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.