Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పవర్లూమ్స్ను అమ్ముకుంటున్న నేతన్నలు
నవతెలంగాణ - సిరిసిల్ల
బతుకమ్మ చీరల భారీ డిజైన్ల వల్ల, వర్కర్లు దొరక్కపోవడంతో, పవర్ లూమ్ యంత్రాలను నేతన్న అమ్ముకుంటున్న పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బతుకమ్మ చీరల వల్ల నేతన్నలకు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే ఉపాధి దొరుకుతోంది. ప్రభుత్వం అందించే భారీ డిజైన్లను నేయడానికి యువత ముందుకు రాకపోవడం, పని చేసే నడీడు వయసున్న నేతన్నలకు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడంతో ఉత్పత్తి నాణ్యత లోపించడం వల్ల వారికి ఆర్డర్లు రావడం లేదు. దాంతో పవర్ లూమ్లను నేతన్న అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. భారీ డిజైన్లను నేయడంలో నైపుణ్యమున్న యువ కార్మికులకు సరైన వేతనం లభించకపోవడంతో వారు భారీ డిజైన్ల వైపు మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్లోని ఓ నేత కార్మికుడు శనివారం పవర్ లూమ్లను అమ్ముకున్నాడు. ఇప్పటి వరకు దాదాపు మూడు వేలకుపైగా సాంచాలను (పవర్ లూమ్ యంత్రాలను) తూకం పెట్టారు.