Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక వడ్డీ పేరుతో డబ్బులు వసూలు
నవతెలంగాణ-గండిపేట్
అధిక వడ్డీ ఆశ చూపి ప్రముఖులు, వ్యాపార వేత్తలు, ఫైనాన్సర్ల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కిలాడీ లేడీ వ్యాపారవేత్త శిల్పాచౌదరిని రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త శిల్ప చౌదరి అధిక వడ్డీ పేరుతో ప్రముఖ హీరోలు, వ్యాపారవేత్తలు, సమాజంలో పలుకుబడి ఉన్న వారి నుంచి డబ్బులు వసూలు చేసింది. సుమారు వంద కోట్ల నుంచి రూ. 2 వందల కోట్ల వరకు వసూలు చేసింది. ప్రముఖులతో పరిచయం పెంచుకుని వారికి విందులు ఏర్పాటు చేసేది. వారికి మాయమాటలు చెప్పి అధిక వడ్డీ ఆశ చూసి వారి నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈ క్రమంలోనే పుప్పాల్‌గూడ ప్రాంతానికి చెందిన దివ్యరెడ్డితో శిల్పకు పదేండ్ల నుంచి పరిచయం ఉంది. దివ్యరెడ్డి నుంచి సుమారు రూ.5 లక్షలు వసూలు చేసింది. ఆమె తిరిగి డబ్బులివ్వాలని అడగగా దివ్యరెడ్డిని శిల్ప బెదిరించింది. దాంతో దివ్యరెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గండిపేటలో ఉన్న శిల్పచౌదరి దంపతులను పోలీసులు అరెస్టు చేసి వివరాలు సేకరించారు. ప్రముఖుల నుంచి రూ. వందల కోట్లు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. శిల్ప మాయలో పడిన వారిలో ప్రముఖ హీరోలు, వ్యాపారవేత్తలు, లాయర్లు, ఫైనాన్సర్లు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. శిల్ప దంపతులను పోలీసులు అరెస్టు చేశాక, వారికి డబ్బులిచ్చిన చాలా మంది బాధితులు బయటకు వస్తున్నారు. తాము కూడా శిల్పకు డబ్బులిచ్చామని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు.