Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతుల వద్ద ఇప్పుడున్న ధాన్యాన్ని కొనాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సూచించారు. హుజూరాబాద్ ప్రభావాన్ని పూడ్చుకునేందుకే ధాన్యం కొనుగోలులో లేని సమస్యను సృష్టించి కొత్త నాటకానికి కేసీఆర్ తెరలేపారని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయనీ, ఆయా పార్టీల నేతలు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని మహవీర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాలని అడిగితే వచ్చే పంట గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ : బండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ...రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని విమర్శించారు. 2023లో అధికారం దక్కించుకోవడం కోసం బీజేపీ కార్యకర్తలు త్యాగాలకు సిద్ధంకావాలనీ, రక్తాలను ధారబోయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 17 నుంచి 20 మధ్య రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అయినా తానే దగ్గరుండి అర్హులందరికీ ఇండ్లు కట్టించే ఫైల్‌పైనే మొదటి సంతకం చేయిస్తానని చెప్పారు. ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, నేతలు ఈటల రాజేందర్, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, జి.వివేక్, రఘునందన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈటలను సమావేశాల్లో సత్కరించారు.
శివప్రకాశ్‌తో ఈటల ప్రత్యేక భేటీ
బీజేపీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్‌తో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ చెట్టుకింద సమావేశమయ్యారు. ముప్పావుగంట తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ వాళ్లు విజివల్స్ తీసేందుకు యత్నించగా తీయొద్దని సూచించారు.