Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
రైతుల ప్రాణాలు వరి కుప్పలపైనే పోతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు వడ్లు కొనడం చేతగాకపోతే... పదివేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి వరి గింజా కొని, విదేశాలకు ఎగుమతి చేస్తామనీ, తద్వారా రైతులకు గిట్టుబాటు ధర రూ 1950 చెల్లించడంతోపాటు రూ 500 బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. దీనికి కాంగ్రెస్ సిద్ధమనీ, సీఎం కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. ధాన్యం కొనలేకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగబోమని తెలిపారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకపోతే మోడీ, కేసీఆర్‌కు ఉరి తప్పదని ఆయన హెచ్చరించారు. కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ సుంకేటి అన్వేష్‌రెడ్డి అధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద 'వరిదీక'్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రైతుల కష్టానికి దళారులే ధర నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో క్వింటాల్‌కు రూ 490 ఉన్న ధరను కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక రూ 1,030కు పెంచిందని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కేసీఆర్‌కు సోయి ఉంటే కాంగ్రెస్ రైతులకు ఏం చేసిందో అర్థమవుతుందని చెప్పారు. 'ధాన్యం కొనుగోళ్లు దసరాకు మొదలై...దీపావళి పండుగకు ముగియాలి' కానీ అన్ని పండగలైపోయినా కొనే దిక్కే లేదని విమర్శించారు. ఇది సీఎం కేసీఆర్ సష్టించిన గందరగోళమేనన్నారు. కనీసం రైతులకు గొనే సంచులు ఇవ్వలేదనీ, రవాణా సౌకర్యం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్లాల్లో వడ్లు కొనకుండా యాసంగి పంట గురించి మాట్లాడటానికి సీఎంకు సిగ్గుందా? అని నిలదీశారు. ఢిల్లీ వెళ్లి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి ఇంట్లో విందు చేసుకున్నావు కానీ... ప్రధానిని ఎందుకు అపాయింట్మెంట్ అడగలేదు' అని ప్రశ్నించారు. రైతులు చస్తుంటే కడుపులోకి తిండి ఎలా పొతుందని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడకుండా నోట్లో గడ్డి పెట్టామంటూ కేంద్ర మంత్రులు చెబుతున్నారంటే, బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరూ తోడు దొంగలేనన్న విషయం తేలిపోయిందన్నారు. సారా, సోడాల్లా ఇద్దరూ కలిసి దావత్ చేసుకుంటున్నారని విమర్శించారు. దేశ సరిహద్దుల్లో దీక్ష చేసిన రైతులే తమకు ఆదర్శమనీ, అందుకే రెండురోజులపాటు దీక్ష చేస్తున్నామని చెప్పారు.
వడ్లు కొనపోతే పార్లమెంటులో ప్రధాని మోడీ చొక్కా పట్టుకుంటామని రేవంత్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై సభలో నిలదీస్తామని చెప్పారు. మద్యం దరఖాస్తుల ద్వారా వచ్చిన డబ్బుతో మొత్తం ధాన్యాన్నికొనుగోలు చేయొచ్చునని తెలిపారు. ధాన్యం రాశుల వద్ద చనిపోయిన రైతులకు కనీసం రైతు బీమా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రూ లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న కేసీఆర్...రైతులు పండించిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెబితే... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసింది ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చి ధాన్యం కొనే వరకు కొట్లాడతామని చెప్పారు. వరి దీక్షలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేతలు వి హనుమంతరావు, కోదండరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సిరిసిల్ల రాజయ్య, జి చిన్నారెడ్డి, మల్లు రవి, సునీతారావు మాట్లాడారు.