Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగిలో వరి పంట వేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ రైతులకు సూచించారు. ఉప్పుడు బియ్యం (పార్బాయిల్డ్ రైస్) తీసుకోవద్దంటూ కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని ఆయన గుర్తు చేశారు. అయితే యాసంగిలో వచ్చే ధాన్యం పార్బాయిల్డ్ బియ్యం తయారీకే అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో రైతులు యాసంగిలో వరి సాగు చేయొద్దంటూ ఆయన కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎస్... శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు తదితరాంశాలపై ఆయన వారితో చర్చించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న వారు మాత్రమే వరి సాగు చేసుకోవాలంటూ ఆయన ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుతానికి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్నే కొంటామంటూ కేంద్రం చెప్పిందని వివరించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ధాన్యం ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తోందనీ, అది రాకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చే మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సీఎస్ సూచించారు.