Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోళ్ల వేగం పెరగని ఖరీఫ్ ధాన్యం
- వరి వేయొద్దంటున్న సర్కార్
- ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించని పాలకులు
- కత్తెర పంటను కోల్పోనున్న రైతులు
- ఏ పంట వేయాలో తెలియక సతమతం
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
యాసంగిలో వరి వేయొద్దన్న ప్రభుత్వ ప్రకటన రైతులను సంకట స్థితిలోకి నెట్టింది. ప్రస్తుతం ఖరీఫ్‌లో వేసిన ధాన్యం కొనుగోళ్లే మందకొడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో యాసంగి పంటల సాగుపై సర్కార్ రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. వరి వేయొద్దంటూ.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు ఎలాంటి అవగాహన కల్పించడం లేదు. పొలాలు బీళ్లుగా మారనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో రైతులు పంటలను కోయడం లేదు. కొందరు పంటలను కోసి సిద్ధం చేసినా.. కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముడుపోతేగానీ యాసంగి పంటలను సాగు చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో యాసంగి సాగు ఆలస్యమైతే కత్తెర పంటను కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగిలో 6.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేవారు. మరో ఐదు లక్షల ఎకరాల్లో కూరగాయలు, పప్పు దినుసులు, మిర్చి వంటి పంటలను సాగు చేసేవారు. ఈ ఏడాది యాసంగిలో వరి సాగు చేయరాదని ప్రభుత్వం ప్రకటన చేసింది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో చేతులెత్తేసింది. దీంతో రైతులకు సాగుపై ఎటూ తేల్చుకోవడం లేదు. ఖరీఫ్ వరి పంట కొనుగోళ్లే అంతంత మాత్రంగా సాగుతున్నాయి. యాసంగిలో ప్రభుత్వం వద్దన్నా వరి సాగు చేస్తే.. కొనేదెవరని రైతులు తలలు పట్టుకుంటున్నారు. యాసంగిలో మొత్తం సాగులో సగానికిపైగా వరిని సాగు చేస్తారు. నవంబరు మొదటి వారంలోనే నారుమళ్లు పోయాల్సి ఉంది. మార్చి వరకు పంట చేతికొచ్చేలా సాగు చేయాలి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కత్తెర పంటలు సాగు చేయాల్సి ఉంది. యాసంగి పంట త్వరగా చేతికి వస్తేనే కత్తెర పంట వేస్తారు. లేకుంటే కత్తెర పంటనూ కోల్పోయే ప్రమాదం ఉంది.
అనుకూలం కాని ఇతర పంటలు
ఉమ్మడి జిల్లాలో ఆహార, ఇతర పంటల సాగుకు భూములు అనుకూలంగా లేవు. నల్లరేగడి భూముల్లో పప్పుశనగ, కుసుమ, నువ్వులు, పొగా పంటలు సాగవుతాయి. చౌట, ఎర్ర, గులక, తేలికపాటి భూముల్లో ఈ పంటలు సాగు కావు. జిల్లాలో నల్లరేగడి భూములు కేవలం 50 ఎకరాలే. మిగితావన్నీ వరికి అనుకూలమైన భూములే. పుష్కలంగా సాగునీటి వనరులున్నాయి. వరి సాగు కాకుండా ఇతర పంటల సాగు అంతగా ప్రయోజనం ఉండదు. కూరగాయలు, మిర్చి, వేరుశనగ వంటి వాణిజ్య పంటలు అరకొర సాగవుతాయి.
వరి తప్ప ఇతర పంటలు పండవు
కేసరి సముద్రం నుంచి వచ్చే చిన్న వాగు సమీపంలో నాకు రెండెకరాల భూమి ఉంది. నీరు పష్కలంగా ఉంది. చౌట భూమిలో వరి తప్ప వేరే పంటలు సాగు కావు. ప్రభుత్వం చెప్పే మినుములు, కుసుమలు, పొగాకు వంటి పంటలు మా పొలంలో పండే అవకాశం లేదు. వరి తప్ప వేరే సాగు చేస్తే పెట్టుబడి కూడా రాదు.
- లక్ష్యయ్య, తెలకపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా
వరి సాగుకు ఆదేశాలివ్వాలి
నవంబర్ దాటితే యాసంగి వరి సాగు అంత శ్రేయస్కరం కాదు. సాగు చేసినా దిగుబడి అంతగా ఉండదు. నాలుగు నెలల్లో తేడా వస్తే కత్తెర పంట దెబ్బతింటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వరి సాగుపై మీమాంసను వీడాలి. వెంటనే సాగు పట్ల సానుకూల ప్రకటన చేయాలి. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు.
- ఎ.రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్