Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
సీతారామ ప్రాజెక్టులో భూమి కోల్పోయి 18 నెలలు అవుతున్నా నష్ట పరిహారం అందకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలులో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, రైతులు తెలిసిన వివరాల ప్రకారం.. బీరోలుకి చెందిన రైతు రాసాల శ్రీను(42) కు 2 ఎకరాల భూమి బీరోలు రెవెన్యూ పరిధిలో ఉంది. ఇందులో 30 కుంటల భూమి సీతారామ ప్రాజెక్టు కాలువ తవ్వకానికి ప్రభుత్వం సేకరించింది. రైతులు ఎన్నో ఆందోళనలు చేసిన ఫలితంగా ఒక ఎకరానికి రూ.18.50 లక్షల నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 18 నెలలు గడిచినా నష్టపరిహారం ఇవ్వకపోవటంతో బీరోలు, తాళ్లచెర్వు, పోచారం గ్రామాల రైతులు ఆదివారం బీరోలులోని సీతారామ ప్రాజెక్టు క్యాంపు దగ్గరకి వెళ్లారు. వీరిలో రాసాల శ్రీను ఉన్నాడు. క్యాంపు దగ్గర సంబంధించిన అధికారులు ఎవరూ లేకపోవడంతో సోమవారం గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్‌ను కలుద్దామని కార్యాచరణ రూపొందించారు. ఈ తతంగం అంతా గమనించిన శ్రీను నష్టపరిహారం రావడానికి ఇంకా సమయం పడుతుందని దిగ్భ్రాంతికి గురై సరాసరి తన మిరప తోట దగ్గరకు వెళ్లి పురుగు మందు తాగి మిరప కల్లంలో కుప్ప కూలిపోయాడు. ఇతనికి భార్య పద్మ, కుమారుడు సాయి, కూతురు స్వాతి ఉన్నారు.
రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి :
రైతు సంఘం, సీపీఐ(ఎం) డిమాండ్
బలవన్మరణానికి పాల్పడిన రాసాల శ్రీను కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని రైతు సంఘం జిల్లా నాయకులు తుళ్ళూరి నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొమ్ము శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.