Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్లలో ఎక్కడా కనిపించని వైనం
- సబ్‌కమిటీ ఆదేశాలు బేఖాతరు
- ఎక్కడికక్కడే ధరణి సమస్యలు
- ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్‌తో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా.. కొత్తవి పుట్టలుపుట్టలుగా పుస్తుకొస్తున్నవి వాటిని పరిష్కరించే దిశగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలూ ఒకడుగు ముందుకు రెండగులు వెనక్కి అన్న చందంగా తయారైనవి. రాష్ట్ర సర్కారు ధరణిలోని సమస్యలను పరిష్కరించేందుకు వేసిన సబ్‌కమిటీ సూచనలూ సరిగా అమలు కాని పరిస్థితి నెలకొంది. భూ యజమానులు, అమ్మకందారులు, కొనుగోలుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి కలెక్టరేట్లోనూ హెల్ఫ్డెస్కును ఏర్పాటు చేయాలని సబ్‌కమిటీ సూచించి దాదాపు పక్షం రోజులు గడుస్తున్నా..ఎక్కడా ఏర్పాటు కాలేదు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం తహసీల్, కలెక్టరేట్లు, మీ-సేవా కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ధరణి పోర్టల్‌లో భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్‌కమిటీని వేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ సంఘాల నేతలు, క్రెడారు ప్రతినిధులు, భూ యజమానులు ధరణి పోర్టల్‌లో తరుచూ ఉత్పన్నం అవుతున్న 30కిపైగా సమస్యలను సబ్‌కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే సబ్‌కమిటీ పలుమార్లు దీనిపై భేటీ అయింది.
ఈ నెల 17వ తేదీన కూడా క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే ప్రతి కలెక్టరేట్లోనూ ధరణి హెల్ఫ్డెస్కును ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. దీనిపై కలెక్టర్లకు సబ్‌కమిటీ నుంచి ఆదేశాలూ వెళ్లాయి. అవి నిరంతం పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. హెల్ఫ్డెస్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలనీ, అప్లికేషన్లు అప్లోడ్ చేసేందుకు అనువుగా మీ సేవా కేంద్రాల వలే అవి ఉండేలా చూడాలని సబ్‌కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జరిగి దాదాపు పక్షం రోజులవుతున్నా ఏ కలెక్టరేట్లోనూ ధరణి హెల్ఫ్డెస్కులు ఏర్పాటు కాలేదు. ధరణి పోర్టల్, మాడ్యూల్స్, ఆప్షన్లపై అధికారులు, మీ సేవ ఆపరేటర్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆదేశమూ ఏ జిల్లాలోనూ అమలు కాలేదు. కొత్త పాసుపుస్తకాల్లో మాత్రం పేర్లు, భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, మ్యూటేషన్ కాకపోవడం, ఎన్నో ఏండ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న భూములు నిషేధిత జాబితాలో చేర్చడం, తదితర సమస్యలున్నాయి. మీసేవా సెంటర్లలో దరఖాస్తులు చేసుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. తహసీల్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పరిష్కారం కోసం ఆఫీసుల చుట్టూ భూ యజమానులు తిరుగుతున్నారు. ఏ అధికారికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్నారు.