Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైరదాబాద్
రాష్ట్రంలో యాసంగిలో వరి పండే భూముల్లో వరే వేసేందుకు, ఇతర పంటల సేధ్యానికి అవసరమైన ఉపకరణాలు, ఆ పంటలకు గిట్టుబాటుధర తదితర అంశాలపై చర్చించేందుకు వెంటనే ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలవాలని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రైతుసంఘం ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. అందుకు తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆదివారంనాడొక ప్రకటనలో కోరారు. వరి చేయకూడదనీ, వేస్తే కొనలేమంటూ గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు. వరి పండే భూముల్లో ఇతర పంటలు బతకవనే సోయి అధికారులకు, ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.ఈ ఏడాది మెట్ట పంటలన్నీ వర్షాలకు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారనీ, ఆ సమయంలో వరి పంట కొంతమేరకు రైతులకు ఊరటనిచ్చిందని గుర్తు చేశారు. వర్షాలు పుష్కలంగా పడి, చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉన్న సమయంలో వరి పంట వేయకూడదనే నిర్ణయం వారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానుకూంగా, నీటి లభ్యతను బట్టి పంటలు వేసుకునే నిర్ణయం రైతులకే వదిలివేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వరితోపాటు యాసంగిలో ఏ పంట వేయాలో తెలియజేస్తూ...ఆ పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, మద్దతు ధర, కొనుగోలు గ్యారంటీ వంటి అంశాల పట్ల స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే వరి వేయకూడదనే ప్రకటనలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.