Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకేదీ భరోసా !
- పెరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యలు
- మరణశయ్యపై కౌలు రైతులు
- వారం రోజుల్లో 10 మంది బలవన్మరణం
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
గిట్టుబాటు కాని సాగుతో కౌలుదారులకు భరోసా లేకపోవడం, అప్పులు తీర్చలేని దయనీయ స్థితిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉరుకొండ మండలం రామ్రెడ్డిపల్లిలో ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారం తిరగకముందే 10 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలుదార్లను గుర్తించి వారికి భరోసా కల్పించే దిశగా నిర్ణయం తీసుకోకపోతే మరిన్ని దారుణాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లక్ష మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 25 వేల మంది, గద్వాలలో 30 వేలకు పైగా కౌలు రైతులున్నారు. నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో మరో 45వేల మంది కౌలు రైతులున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం రాంరెడ్డి పల్లిలో గుర్రం దశరథంకు రెండెకరాల వ్యవసాయ పొలం ఉంది. దీనికి తోడు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. రెండేండ్లుగా ప్రకృతి సహకరించకపోవడం, ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సాగు కోసం రూ.మూడు లక్షలకు పైగా అప్పులు చేశాడు. అప్పు తీరే దారి లేక శనివారం వ్యవసాయ పొలంలోనే ఉరి వేసుకున్నాడు. అతని తమ్ములు బాలకృష్ణయ్య, బాలస్వామి సైతం గతంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబానికి పెద్దదిక్కయిన ముగ్గురూ చనిపోవడంతో వీరి భార్యలు, పిల్లలు అనాధలయ్యారు. కొల్లాపూర్ మండలం ముక్కిడి గుండం గ్రామంలో కేతావత్ లక్ష్మణ్ నాయక్ (45).. పోడు భూమి ఐదు ఎకరాలు ఇతరుల దగ్గర కౌలుకు తీసుకున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నీటిపాలైంది. పంట చేతికి రాక తెచ్చిన అప్పులు అధికమై మనస్తాపానికి గురై పుల్ల మందు తాగి చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన రాములు.. కళ్ళముందు ఆరబెట్టిన వరి ధాన్యం అధిక వర్షాలకు మొలకెత్తడంతో అప్పులెలా తీర్చాలన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లా కిల్లా ఘణపూర్ మండలం పెద్దమందడి గ్రామంలో రైతు నరసింహ వరి ధాన్యం తడిసి ముద్ద కావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నారాయణపేట జిల్లా షేర్నిపల్కు చెందిన జట్ మల్లప్ప ఊట్కూరు మండలం అం తిమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గోపాల్ నాయక్ దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన సిద్ధప్ప బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతుల వరుస మరణాలతో వ్యవసాయం అంటేనే రైతులు భయపడే పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులకు భరోసా కల్పించేలా కౌలుదారుల చట్టాన్ని అమలుచేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు.
మా బతుకు బుగ్గిపాలైంది
కౌలు తీసుకొని సాగు చేసుకుంటున్న మాకు అప్పులే మిగిలాయి. అప్పులు తీరే దారి లేక మా నాన్న దశరథ చనిపోయాడు. మేము దిక్కులేని పక్షుల మైనం. రెండు లక్షల అప్పు అయింది. దిక్కులేని మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
- శ్రీశైలం, కౌలు రైతు మృతుని కుమారుడు
కౌలు రైతులకు హక్కుచట్టాన్ని అమలుచేయాలి
కౌలు రైతులకు గతంలో మాదిరిగానే కౌలుదారులకు హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ప్రభుత్వం వీరికి భరోసా వచ్చేలా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పరిహారం పట్టాదారులకు కాకుండా కౌలు రైతులకు నేరుగా అందజేయాలి. కౌలుదారులకు పంట రుణం వచ్చేలా నిర్ణయం తీసుకోవాలి. ఈ పథకాలు కౌలు రైతులకు అమలు చేస్తే రైతులకు భరోసా కలుగుతుంది.
-చిలుక బాల్రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, నాగర్కర్నూల్