Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం
- అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలు
- అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం:
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రైతాంగ పోరాట ఫలితంగానే నల్ల చట్టాలు రద్దు చేశారనీ, ఇది రైతుల విజయమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. జనవరి 22 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన నిధి వసూళ్ల కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడులో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వేగవంతం చేసిందన్నారు. ఉభయ సభల్లో మంద బలం చూసుకొని నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం విధించి, వారి పోరాటాన్ని చులకన చేసి రైతుల మరణాలకు కారణమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల రోజురోజుకూ అదుపు లేకుండా పోతుందన్నారు. రైతాంగం, కార్మిక వర్గంపై పెనుభారం పడుతోందన్నారు. కేంద్రీకృత పాలన సాగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన చేస్తూ రాష్ట్రాల హక్కులను, ఫెడరల్ విధానాలను హరిస్తుందన్నారు. రాష్ట్రంలోనూ కేేసీఆర్ ప్రభుత్వం అవకాశవాద విధానాలను ముందుకు తెస్తుందన్నారు. కేంద్రంపై ఉద్యమించడంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని తెలిపారు. వాగ్దానాలు అమలు చేయకుండా అవకాశవాద ధోరణిలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ తరుణంలో జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు బహుముఖ ఉద్యమాలకు మార్గదర్శిగా నిల్వనున్నా యని చెప్పారు. ప్రజా ఉద్యమాలకు పెద్దపీట వేయనున్నామనీ, అందుకని రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర మహాసభలు విజయవంతం కోసం సీపీఐ(ఎం) పార్టీ శ్రేణులు నిధి వసూళ్లలో ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆర్థిక సహాయం చేసి ప్రజా ఉద్యమాలకు పునాది వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, మండల కార్యదర్శి సీహెచ్ జంగయ్య, నాయకులు బుగ్గరాములు, జగన్, లింగస్వామి, వెంకటేష్, గణేష్, రమేష్, సురేష్, ప్రభుదాస్, భిక్షపతి, వెంకటేష్, విజయమ్మ, మస్కు అరుణ, స్వప్న తదితరులు ఉన్నారు.