Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
- మూడనమ్మకాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలని పిలుపు
- నూతన అధ్యక్షకార్యదర్శులుగా కోయ కోటేశ్వరరావు, శ్రీనాధ్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎస్ఎల్ఎన్ఎస్ కన్వెన్షన్లో రెండు రోజులుగా జరుగుతున్న జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ముగింపు సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లాడుతూ.. కొవిడ్లాంటి కష్టకాలంలో కూడా జేవీవీ బాధ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి మనోదైర్యాన్ని కలిగించడం అభినందనీయమన్నారు. సత్యాన్వేషణ కోసం జేవీవీ పనిచేస్తున్న తరుణంలోనే అసత్యాన్ని పారదోలడం అంత సులభం కాదనీ, కానీ దాన్ని ఎదుర్కోకపోతే ఫలితం శూన్యమని తెలిపారు. సమాజంలో అసత్యాలు జోరుగా ప్రచారం జరుగుతున్న నేటి పరిస్థితుల్లో జెవివి ఆవశ్యకత చాలా అవసరమన్నారు. ప్రస్తుతం నూతన తరం ఈ సంఘంలో పనిచేస్తున్నారనీ, అదే ఉత్సాహంతో వచ్చే తరాన్ని కూడా నిర్మాణంలోకి తీసుకురావాలని సూచించారు. అయితే పలువులు జిల్లా బాధ్యులు మాట్లాడుతూ.. జిల్లాల్లో విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ఉందనీ, వాతావరణ కాలుష్యం, రైతులు పంటలకు వాడుతున్న పురుగు మందుల వాడకంపై వారిని చైతన్యం చేయాల్సిన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడితే బాగుంటుందని సూచనలు చేశారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో కళాకారుల పాటలు, మేజీషియన్ అందర్ని ఆకట్టుకున్నాయి. నవ తెలంగాణ బుకహేౌజ్, జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తక ప్రదర్శన ప్రతినిధులను ఆకట్టుకుంది.
జేవీవీ నూతన రాష్ట్ర కమిటీ
26 మందితో జేవీవీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా డాక్టర్ సిహెచ్. మోహన్రావు (సీసీఎంబీ మాజీ డైరక్టర్), డా||.మోహోతాబ్ ఎస్ బామ్జీ (రిటైర్డు సైంటిస్టు), డాక్టర్ దాసరి ప్రసాద్ (నిమ్స్ మాజీ డైరక్టర్), అధ్యక్షులుగా డాక్టర్ కోయ కోటేశ్వర్రావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎం. రమాదేవి, ఎం. శ్రీనివాస్, రాములమ్మ, డాక్టర్ ప్రతాప్, శ్రీమతి కస్తూరి, జితేందర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనాధ్, కార్యదర్శులుగా అలువాల నాగేశ్వర్రావు, రవీందర్రెడ్డి, నర్సింహులు, సంపతి రమేష్, నర్సయ్య, వెంకటరమణారెడ్డి, కోశాధికారి రావుల వరప్రసాద్ ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 26మందిని ఎన్నిక చేశారు. వివిధ రంగాలకు సంబందించిన సబ్ కమిటీలకు కూడా కన్వీనర్లను ఎంపిక చేశారు.