Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'కేసీఆర్ సారు వరి సాగు చేస్తే రైతు ఉరేసుకున్నట్టే అంటున్నాడు.. కానీ రైతులు వరి సాగు చేయకపోతే మాకు 'ఉరి' తప్పెట్టు లేదు. వరి సాగు చేస్తేనే మాకు ఉపాధి.' అని వ్యవసాయంపై ఆధారపడ్డ కార్మికులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు తూకాలు పోసినప్పటి నుంచి ధాన్యం అమ్మే వరకూ చాలా మందికి ఉపాధి దొరుకుంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి వేయొద్దని స్పష్టం చేయడంతో ఒకవైపు రైతులు ఆందోళన చెందుతుంటే.. రైతుపై ఆధారపడ్డ రైతు కూలీ నుంచి హమాలీ వరకు తమ ఉపాధి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్పోర్టుతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేసే లక్షలాది మంది జీవనోపాధి ప్రశ్నార్థకం కానుంది.
వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతు కూలీలు, హమాలీ కార్మికులు, ట్రాన్స్‌పోర్టు రంగం, రైస్ మిల్లర్లు, ఇలా ఒకట్రెండు కాదు అనేక వ్యవసాయ అధారిత రంగాలపై ప్రభావం పడనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 4లక్షల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం పొందుతున్నారు. ఇందులో రైతు కూలీలు, హమాలీ, ట్రాన్స్‌ఫోర్టు రంగంలో పనిచేసే డ్రైవర్లు, ఇతర కార్మికులు ఉన్నారు. జిల్లాలో సుమారు 50వేల మంది హమాలీ కార్మికులు ఉన్నారు. జిల్లాలోని రైస్‌మిల్లులో పనిచేసే వారే సుమారు 20 వేల మంది ఉన్నారు. స్థానిక కార్మికులే కాకుండా.. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 370 రైస్ మిల్లులు ఉండగా.. ఒక్కో రైస్ మిల్లులో సుమారు 150మంది హమాలీ కార్మికులు, మరో 20 నుంచి 30 మంది చాట పనిచేసే మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ సెంటర్లు, పీసీఎస్ సెంటర్లలో ప్రస్తుత లెక్కల ప్రకారం 3,280 మంది కార్మికులు పని చేస్తున్నారు. యాసంగి నుంచి వరి సాగు చేయకపోతే వీరి జీవనం ప్రశ్నార్థకంగా మారనుంది.
వ్యవసాయ కార్మికులపై తీవ్ర ప్రభావం
ఒకటి, రెండు ఎకరాల్లో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యవసాయ కార్మికులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి వారు తమకు ఉన్నదాంట్లో సాగు చేసుకుంటూ ఇతర వ్వవసాయ పనులకు కూడా వెళ్లేవారు. కానీ ఇప్పుడు తనకు ఉన్న కొద్దిపాటి పొలంలో సాగు చేయకుండా ఒకవైపు ప్రభుత్వం అడ్డుకోవడం, వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేకపోవడంతో వీరి జీవన పరిస్థితి మరింద దారుణం కానుంది. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించాలని లేదా తమకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని వ్యవసాయంపై ఆధారపడిన కార్మికులు కోరుతున్నారు.
వరి వేయకపోతే ఉపాధి లేనట్లే..
30 ఏండ్లుగా రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తున్న. చిన్న కరువు వచ్చి పంట దిగుబడి తగ్గిందంటేనే.. మా జీవితాలు ఆగమాగం అవుతాయి. ఏకంగా వరి సాగు చేయొద్దంటే మాకిక భవిష్యత్‌లో పని దొరకనట్టే. రైతులు వరి పండిస్తేనే మాకు చేతినిండా పని దొరుకుతుంది. వరి సాగు చేయకపోతే రైతు కుటుంబాలే కాదు.. మాలాంటి కార్మికుల కుటుంబాలు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది.
శ్రీనివాస్, రైస్ మిల్లులో పనిచేస్తున్న హమాలీ కార్మికుడు
ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
ప్రభుత్వం వ్యవసాయం రంగంపై తీసుకుంటున్న నిర్ణయంతో రైతులు, రైతు కూలీలు, కార్మికుల జీవన స్థితిగతులు అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంది. వేలాది మంది హమాలీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఉద్యమం చేస్తాం.
- బ్రహ్మయ్య, తెలంగాణ ఆల్ హమాలీ
వర్కర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి.
ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాలదే..
ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. రైతులను ప్రత్యామ్నాయ పంటలు వేయమనడమే కాదు.. రైతు పండించిన పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలి. ఇతర ప్రాంతాల నుంచి ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. రైతులను వరి వేయొద్దంటే.. రైతు నష్టపోవడమే కాదు. లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడే ప్రమాదం ఉంది.
- దయాకర్‌రెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ