Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థంతి కార్యక్రమంలో స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత సామాజిక మార్పునకు జోతిబా ఫూలేస్ఫూర్తి అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం జోతిబాపూలే 131 వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్కైలాబ్ బాబు మాట్లాడుతూ మహారాష్ట్రలో నాడు పీష్వాల పాలనలో శూద్రుల పట్ల అణచివేత, దురాచారాలకు నిరసనగా అనేక ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. విద్యతోనే మార్పు సాధ్యమని అందరికీ విద్యకోసం కృషి చేశారన్నారు. స్త్రీ విద్య, సమానత్వ సాధన కోసం తన భార్యకే మొదట చదువు నేర్పి, సమాజానికి విద్యనందించిన గొప్ప విప్లవ కారుడని వివరించారు. పెండ్లీలు, ఇతర జాతరలు ఉత్సవాల పేరుతో వేల రూపాయలు ఖర్చు పెట్టొద్దనీ, పూజారి లేకుండా పూల దండలు మార్చి ఆదర్శ వివాహాలు జరిపించారని చెప్పారు. వితంతువుల పునర్వివివాహాలు జరిపి కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పాలకులు అందరికి చదువును దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించిందన్నారు. ఐఐటీ వంటి ఉన్నత విద్య సంస్థలల్లో రిజర్వేషన్లు ఎత్తివేసి దళిత బలహీన వర్గాలకు విద్యను దూరం చేసిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రయివేటు యూనివర్సిటీలను తెచ్చి ఉన్నత విద్య నుంచి దళితులు, పేదలను దూరం చేసిందన్నారు ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం డి అబ్బాస్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, టీపీఎస్కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు రిటైర్డ్ పంచాయతీ రాజ్ అధికారి ఇ నర్సింగరావు సీనియర్ అంబేద్కర్ వాదీ గొల్లపెల్లి దయానంద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నగర అధ్యక్షకార్యదర్శులు బి సుబ్బారావు కె యాదగిరి, నాయకులు బి పవన,్ సందేపోగు పవన,్ వి శంకర్, పి వెంకన్న, జగదీష్, వంశీ , సుధీర్ తదితరులు పాల్గొన్నారు.