Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు బుకీల అరెస్ట్
- రూ. 2.05కోట్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ జిల్లా కేంద్రంలో ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను పోలీసులు ఆరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.05 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరంగల్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఇద్దరు నిందితులను విలేకరుల ముందు హాజరుపర్చి వివరాలు వెల్లడించారు.
హన్మకొండ జిల్లా విజయనగర్‌కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ హైద్రాబాద్‌లోని హఫీజ్‌పేటలో రెడీమేడ్ బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. సంపాదన సరిపోక.. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 2016లో నుంచి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు. పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుండటంతో 2018లో తన స్నేహితులతో కలిసి ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్ నిర్వహించసాగాడు. ఈ క్రమంలో ముంబయి కేంద్రంగా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించే మరో నిందితుడు అభరుతో ప్రసాద్‌కు పరిచయం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే బుకీగా నియమితుడయ్యాడు. బెట్టింగ్‌లో పాల్గొనే వారు ముందుగా డబ్బులు చెల్లించిన తర్వాత వాట్సాప్ ద్వారా లింక్ పంపేవారు. గెలుపొందిన వారికి రెండింతల డబ్బు ఇస్తుండటంతో వారు మరింత ఎక్కువ డబ్బులతో బెట్టింగ్ పెట్టేవారు. అలా పెట్టిన వారిని అనంతరం ఓడిపోయేలా మోసాలకు పాల్పడేవారు. ప్రసాద్ డబ్బు లావాదేవీలను నిర్వహించేందుకు బినామీ పేర్లపై 43 బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో 2019లో మరో ఇద్దరు నిందితులతో హైదరాబాద్‌లో అరెస్ట్ అయి ప్రసాద్ జైలుకు వెళ్లి వచ్చినట్టు కమిషనర్ తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు గుర్తిస్తారని.. ప్రసాద్ తన అత్తగారి ఊరైన హన్మకొండకు మకాం మార్చాడు. ఐపీఎల్, టీ-20 వరల్డ్ కప్‌తో పాటు పేకాట ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ.. బినామీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవాడు. ఈ డబ్బుతో వివిధ స్థిరాస్తులను కొనుగోలు చేశారు. బెట్టింగ్‌లో మోసపోయిన వ్యక్తులు కేయూసీ పోలీస్‌స్టేషన్‌లో 2 కేసులు, హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదయినట్టు వెల్లడించారు. దాంతో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా ఆధ్వర్యంలో కేయూసీ, సైబర్ క్రైం పోలీసులు నిఘా పెట్టారు. నిందితుల్లో ఒకడైన అభరు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు సోమవారం ఉదయం మరో నిందితుడు ప్రసాద్ ఇంటికి వచ్చినట్టుగా కేయూసీ పోలీసులకు సమాచారం రావడంతో ఇన్స్పెక్టర్ జనార్ధన్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర ఆన్లైన్ బెట్టింగ్ బుకీల అరెస్టుతో మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, కెేయూసీ సీఐ జనార్ధన్‌రెడ్డి, ఎస్సై సంపత్, ఏఏఓలు ప్రశాంత్, సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు అశోక్, మధు, జగదీశ్, కమలాకర్‌లను పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు.