Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి
- మహిళా సంక్షేమ కమిషనర్‌కు ఎన్పీఆర్డీ,
వీజేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5శాతం కేటాయించాలనీ, బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక, వీజేఏసీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకటయ్య, ఎం అడివయ్య, వీజేఏసీ స్టీరింగ్ కమిటీ చైర్మెన్ ముత్తినేని వీరయ్య కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 5 శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వారికి మొదటి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న మోడల్ మార్కెట్లల్లో, మున్సిపల్ పట్టణాల్లో షాపింగ్ కాంప్లెక్సుల్లో ఐదు శాతం కేటాయించాలని కోరారు. 21 రకాల వైకల్యాలకు ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలనీ, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు, సహాయకులకు ప్రత్యేక అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మించాలనీ, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని రకాల ఆర్టీసీ బస్సులో బస్సు పాస్‌లను అనుమతించాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా నిరుద్యోగ వికలాంగులకు 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.