Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధులూ లేవు.. నిధులూ లేవు..
- పేరుకే ప్రజాప్రతినిధులమంటున్న ఎంపీటీసీలు
- ప్రజాస్వామ్యయుత అధికారాలేవీ ఆచరణలో లేవు
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు పోటీ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న ఆరు స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీలు) నిరసనగళం విప్పుతున్నారు. అధికారపార్టీ నుంచి గెలిచినా పలువురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటున్నారు. విధులూ.. నిధులూ ఏమీ లేకుండా తమను ఉత్సవ విగ్రహాల్లా మార్చారని రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు జరిగే 12 స్థానాల్లో తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ఎంపీటీసీల సంఘం నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార బలాన్ని ఉపయోగించి ప్రభుత్వం వారిలో 9 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేలా.. లేదంటే దౌర్జన్యం చేసైనా విత్డ్రా చేసుకునేలా ఒత్తిడి తెచ్చారని ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి ఎంటీసీల తరఫున స్వతంత్ర అభ్యర్థులుగా పలువురు ఎంపీటీసీలు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మంలో ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షులు, కల్లూరు మండలం పేరువంచ ఎంపీటీసీ కొండపల్లి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రాష్ట్ర జడ్పీటీసీల సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆరు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా 5,326 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఎంపీటీసీలే ఉన్నారు. 3,223 మంది ఎంపీటీసీలు, 325 మంది జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు 1,544, కార్పొరేటర్లు 169, ఎక్స్అఫిషియో సభ్యులు 65 మంది ఉన్నారు. ఎంపీటీసీల సంఘం నుంచి అభ్యర్థులు బరిలో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1,271 మంది ఓటర్లుండగా వీరిలో 758 మంది ఎంపీటీసీలున్నారు. జడ్పీటీసీలు 71, కౌన్సిలర్లు 424, ఎక్స్అఫిషియోలు19 మంది. ఖమ్మంలో మొత్తం 768 మంది ఓటర్లుండగా 529 మంది ఎంపీటీసీలు, 45 మంది జడ్పీటీసీలు, 125 మంది కౌన్సిలర్లు, 60 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్అఫిషియో సభ్యులున్నారు. ఒకవేళ తమ అధికారాన్ని హక్కులను ప్రభుత్వం తొక్కిపెడుతుందని ఎంపీటీసీలు కన్నెర్రజేస్తే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అధికారపార్టీ అభ్యర్థుల గెలుపు గల్లంతేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎంపీటీసీలు ఏమి అడుగుతున్నారు?
తాము ఏమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఎంపీటీసీలు తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా సంక్రమించిన విధులు, నిధులను మాత్రమే ఇవ్వమంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీటీసీలకు ఎటువంటి ప్రాధాన్యం లభించిందో అది మాత్రమే కోరుకుంటున్నామని అంటున్నారు. 243 రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలను స్థానిక సంస్థలకు బదలాయించారు. కానీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు వాటిని తొక్కిపెడుతున్నారని ఎంపీటీసీలు గగ్గోలు పెడుతున్నారు. తాము ఎన్నికై రెండు సంవత్సరాల నాలుగు నెలలైనా కనీసం గ్రామపంచాయతీలో తమకో గది కూడా కేటాయించలేదని వాపోతున్నారు.
రూ.5,000 ఉన్న వేతనాన్ని రూ.15,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఎంపీటీసీల వేతనం రూ.6,500 చేసినా అది ఇప్పటికీ అమలుకావడం లేదు. తమ పరిధిలోని ప్రాదేశిక నియోజకవర్గాల అభివృద్ధికి ఏడాదికి రూ.20 లక్షల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మండల పరిషత్ నుంచి నిధులు కేటాయించినా గ్రామపంచాయతీలు తీర్మానం చేయాలనడంతో ఆ నిధులకూ ఎంపీటీసీలు నోచుకోవడం లేదు. 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధులు ఎంపీటీసీలకు 10-25శాతం కేటాయించాలని నిబంధనలు చెబుతుంటే.. ఇక్కడ మాత్రం 5-10 శాతం మాత్రమే అమలు చేస్తున్నారు. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీలు ఎంపీటీసీల ద్వారానే ఫండ్ ఖర్చుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆత్మగౌరవ జీవోలైనా తక్షణం అమలు చేయాలి..
ఆర్థిక పరమైన అంశాలు తక్షణం అమలు చేయకపోయినా వాటిపై స్పష్టమైన హామీ నివ్వాలి. ఆత్మగౌరవానికి సంబంధించిన జీవోలనైనా ప్రభుత్వం తక్షణం ఆచరణలో పెట్టాలి. దీనిపై తగిన హామీ లేకుంటే ఈ ఎన్నికల్లో అధికారపార్టీకి తగిన గుణపాఠం చెప్పితీరుతాం. ఎన్నికల తదనంతరం కూడా పోరాడి అధికారాలు, హక్కులు సాధించుకుని తీరుతాం.
- కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీల సంఘం ఎమ్మెల్సీ అభ్యర్థి