Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాదాద్రి భవనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో మరియమ్మ లాకప్‌డెత్‌పై తదుపరి విచారణ అవసరం లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ముగ్గురు పోలీసులపై కేసులు పెట్టినట్లు ప్రభుత్వం చెప్పిందని పేర్కొంది. అయితే, ఆ కేసుల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పింది. మరియమ్మ మృతిపై న్యాయవిచారణకు ఆదేశాలివ్వాలనీ, లాకప్‌డెత్‌కు బాధ్యులపై పోలీసులపై చర్యలు తీసుకోవాలనీ, ఆమె కుటుంబసభ్యులకు రూ.5 కోట్లు ప్రభుత్వం పరిహారం ఇచ్చేలా తీర్పు చెప్పాలని కోరుతూ పౌరహక్కుల సంఘం (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్) పిల్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
భూములు కొంటే నేరం ఎలా అవుతుంది? :
వాన్‌పిక్ ఇండిస్టీయల్ ప్రాజెక్టు ఏర్పాటుకు కావాల్సిన భూములను కొనుగోలు చేసేందుకు రూ.300 కోట్లు వెచ్చించామనీ, తమకు ప్రభుత్వం ఏదో లబ్ధి చేకూరిందని సీబీఐ అభియోగం వాస్తవం కాదని వాన్‌పిక్, నిమ్మగడ్డ ప్రసాద్‌ల తరఫు వాదనలు సోమవారం హైకోర్టులో కొనసాగాయి. వైఎస్ జగన్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే కేసుకూ తమ పెట్టుబడులకు సంబంధం లేదని వారి వాదన. తమపై సీబీఐ కేసు కొట్టేయాలన్న కేసులను న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం విచారణ జరిపారు. పిటిషనర్ల డబ్బుతో భూములు కొనుగోలు చేస్తే సిబీఐ తప్పుపట్టడం అర్ధం లేదన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువే చెల్లించారని, పారిశ్రామిక అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడాన్ని తప్పుపట్టడం, సీబీఐ కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. భూములు కొనుగోలు చేయడమే నేరమని సీబీఐ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విచారణను మంగళవారానికి వాయిదా పడింది.
ఏపీ మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికలపై విచారణ నిలిపివేత
ఏపీ మహేష్ కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి ఆ బ్యాంకు, బ్యాంకు ఎమ్డీ ఉమేశ్ చంద్రలపై ఈడీ పెట్టిన కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. బ్యాంకుకు జరిగిన ఎన్నికలకు సంబంధించి బంజారాహిల్స్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ ప్రకారం ఈడీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఎమ్డీ వేసిన రిట్‌ను సోమవారం విచారణ చేసిన హైకోర్టు ఈడీ విచారణను నిలిపివేసింది.