Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందనీ, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోఆ శాఖ ఉన్నతాధికారు లతో మంత్రి సమావేశమయ్యారు. విద్యా సంస్థల్లో ఎవరికి వారు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విషయ ంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండేలా, చేతులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులందరికీ పరీక్షలు
రాష్ట్రంలో పలు విద్యా సంస్థల్లో కరోనా కేసులు వెలుగుచూస్తున్నా.. వెంటనే ఆయా విద్యా సంస్థల్లోని విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యా సంస్థల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకునేలా ఆయా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోనా తగ్గిందని భావించి.. నిబంధనలను పాటించ డంలో యాజమాన్యాలు, విద్యార్థులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న సమాచారం ఉందన్నారు. అలాంటి పరిస్థితులు పునారావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నిబంధనలు పాటించేలా చూడాలి
కరోనా నిబంధనలను పాటించే విధంగా అవసరమైన సానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను విద్యా సంస్థలు తప్పనిసరిగా వినియోగించేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కరోనా కేసులు నిలకడగా ఉన్నా, మూడో దశ ముప్పు ఉందన్న నేపథ్యంలో అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టేందుకు తగిన ఆదేశాలను జారీ చేయాలని మంత్రి సూచించారు. విద్యాశాఖ అధికారులు, యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయంతో కరోనా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.