Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఏ రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి
- వీఆర్ఏ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పేస్కేలు, పీఆర్సీ జీవోలను వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు డిమాండ్ చేశారు. అరకొర జీతంతో బతకలేక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఏ చల్లా రమేశ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్లో సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట రమేశ్ కుటుంబ సభ్యులు, వీఆర్ఏలు నిరసన తెలిపారు. సీసీఎల్ఏ కార్యదర్శి హైమావతికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని హైమావతి హామీనిచ్చారు. అనంతరం రాములు మాట్లాడుతూ వీఆర్ఏలందరికీ పే-స్కేల్ ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి 14 నెలలు దాటినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పీఆర్సీ పెంచుతున్నట్టు ప్రకటించి ఆరు నెలలు దాటినా పెంపు అమలులోకి రాలేదని వాపోయారు. అప్పులు పెరిగి కుటుంబం గడవక కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, ఘన్పూర్ గ్రామ వీఆర్ఏ చల్లా రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే పే-స్కేల్, పీఆర్సీ జీఓలు విడుదల చేసి వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదనీ, ఐక్య పోరాటమే మార్గమనీ, పోరాటాలకు వీఆర్ఏలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చల్లా రమేష్ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, వీఆర్ఏల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షులు ఎస్డీ అమీరుద్దీన్, రాష్ట్ర కార్యదర్శులు ఎల్. నర్సింహా, రామయ్య, రాష్ట్ర నాయకులు దాదేమియా, బాలరాజు, మల్లయ్య, జహంగీర్, సాయిబాబా పాల్గొన్నారు.