Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాల్లో కుప్పలుగా ధాన్యం
- తేమ పేరుతో కాంటా పెట్టని నిర్వాహకులు
- నాలుగు రోజుల కిందట వర్షాలతో తడిసిన ధాన్యం
- ఫోన్ నెంబర్ అనుసంధానం లేక ఓటీపీతో ఇబ్బందులు
నవతెలంగాణ - పెద్దపల్లి
ధాన్యం కొనుగోళ్లలో అనుకున్న లక్ష్యంలో సగం కూడా ఇంతవరకు కాంటా పడలేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు రోజుల తరబడి ఉంటున్నాయి. అకాల వర్షంతో ఆ ధాన్యం తడిసిపోవడంతో తమ కష్టం చేతికందకుండా పోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు చేసిన పంటకు సంబంధించి రైతుల ఖాతాల్లోనూ డబ్బులు జమ చేయడంలో జాప్యం జరుగుతోంది. ఆధార్ కార్టుకు ఫోన్ నెంబర్ అనుసంధానం లేక ఓటీపీతో సమస్య వస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ఈ సీజన్లో 4లక్షల 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ యంత్రాంగం లక్ష్యం నిర్దేశించుకుంది. కానీ ఇప్పటి వరకు 65వేల 624మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. అంటే 35 శాతం కొనుగోళ్లు జరిగాయి. వాటిలో 64157 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. వానాకాలం పంటకు సంబంధించి కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చి ఇరవై రోజులు దాటింది. ఈ క్రమంలో అకాల వర్షం వల్ల నాలుగు రోజుల కిందట ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ధాన్యం కొనాలంటే పట్టా పాసు పుస్తకంతో పాటు ఆధార్ కార్డుకు ఫోను నెంబర్ అనుసంధానం ఉంటేనే ఓటీపీ నెంబర్ వస్తుందనడంతో రైతులు మీసేవ కేంద్రాలు, పోస్టాఫీసు చుట్టూ తిరుగుతున్నారు.
ధాన్యం రాశులు
పెద్దపల్లి జిల్లాలో ఈనెల 8న కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు 291 కొనుగోలు కేంద్రాలకుగాను 280కేంద్రాలను ప్రారంభించారు. వాటిలో 231 కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. 17శాతం లోపు తేమ రాకపోవడం.. మరోవైపు వర్షాలతో ధాన్యం తడిసి మళ్లీ ఆరబెట్టడం వంటి కారణాలతో ఆలస్యంగా కొనుగోళ్లు జరుగుతున్నట్టుగా సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు.
ధాన్యం డబ్బుల చెల్లింపుల్లోనూ జాప్యమే..
వరి కోసి ధాన్యం కేంద్రాలకు తీసుకురావడమే రైతులకు ఇబ్బంది కాగా.. కేంద్రాలకు తెచ్చిన ధాన్యం ఆరబెట్టడం మరో సమస్య. చివరకు కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించినా.. రైతుల వివరాల కోసం పట్టా పాసు పుస్తకంతోపాటు ఆధార్ కార్డు లింక్ ఉండాల్సి ఉంది. లింకు ఉన్నప్పటికీ ఓటీపీ నెంబర్ వస్తేనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ విధంగా లేని రైతులకు ధాన్యం డబ్బులు చేతికందడానికి తీవ్ర ఆలస్యమవుతోంది. పెద్దపెల్లి జిల్లాలో 9352మంది రైతుల నుంచి రూ.125.62కోట్ల విలువగల ధాన్యం కొన్నారు. ఇప్పటివరకు 291మంది రైతులకు రూ.26కోట్లు జమ చేశారు. మిగతా రైతులు తమ ఆధార్ కార్డుకు లింకు కోసం పోస్టాఫీసులు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
17 శాతం తేనే వస్తే కొనుగోలు వేగవంతం
ప్రవీణ్- జిల్లా సివిల్ సప్లై మేనేజర్
20 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా వస్తున్నది. 15 శాతంలోపు ఉంటే కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతాయి. ఓటీపీకి సంబంధించి రైతుల ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ కోసం పోస్ట్ ఆఫీస్, మీసేవ కేంద్రాల్లో చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. రైతులకు వెంటనే తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. వర్షాలు లేకుండా పది రోజులు గట్టి ఎండలు ఉంటే కొనుగోళ్లు వేగంగా జరుగుతాయి.