Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు/ జోగిపేట
కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పింది. ఒకే గురుకులంలో 47 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలికి పాజిటివ్ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి శివారులోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముత్తంగిలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో కలిపి 520 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. కాగా మూడ్రోజుల కిందట ఓ విద్యార్థికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది. దాంతో హాస్టల్లోని విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కి పాటుకు గురయ్యారు. వెనుకబడిన తరగతుల సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మల్లప్ప బట్ట, సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ గాయత్రి దేవి, ఆర్డీఓ నాగేష్, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి హుటాహుటిన గురుకుల హాస్టల్‌కు చేరుకున్నారు. వారి ఆధ్వర్యంలో వైద్యుల పర్యవేక్షణతో 520 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 47 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపారు. వసతి గృహంలోనే రూమ్‌కి ఐదు మంది చొప్పున విద్యార్థులను క్వారంటైన్లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. గురుకుల వసతి గృహంలో ఒక్కసారిగా ఇంతమంది కరోనా బారిన పడటంతో పారిశ్రామికవాడ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది.
అక్సాన్‌పల్లి ప్రాథమిక పాఠశాల
హెచ్ఎంకు కరోనా పాజిటివ్
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అక్సాన్‌పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాహెబ్ హుస్సేన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ విషయాన్ని ఆందోల్ మండల విద్యాధికారి కృష్ణ సోమవారం రాత్రి తెలిపారు. హుస్సేన్ భార్య కొన్ని రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతుండటంతో ఆమెకు కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఈనెల 26న హుస్సేన్ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోగా.. 28న పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఎంఈఓకు రిపోర్ట్ పంపారు. దాంతో పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు సోమవారం తాలేల్మ పీహెచ్సీ వైద్యులు కరోనా టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చింది. కాగా, పాఠశాలలో ఉన్న 125 మంది విద్యార్థులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండటంతో రెండు రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారని మండల విద్యాధికారి చెప్పారు.
ఎవరూ భయపడొద్దు
కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన 47 మందిని క్వారంటైన్లో పెట్టినం. వైద్య బృందం అప్రమత్తంగా ఉన్నది. నిరంతరం పర్యవేక్షణ జరుగుతున్నది. వీరి శాంపుల్స్‌ను ఆర్టీపీసీ ఆర్ పరీక్షల కోసం పంపించాం. ఆ రిపోర్ట్స్ వస్తే.. కచ్చితమైన నిర్ధారణ జరుగుతుంది. వారి అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
- సంగారెడ్డి డీఎంఅండ్‌హెచ్‌ఓ గాయత్రి దేవీ