Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆటలు సాగవు
- టీఆర్ఎస్ వైఫల్యాలే బీజేపీకి ఊతం..
- పాలకులు గుడ్డిగా ఏ చట్టాలూ చేయొద్దు
- కార్మిక, కర్షక ఐక్యతతోనే నల్లచట్టాల రద్దు
- సాగుచట్టాల రద్దు స్ఫూర్తితో పోరాడుదాం.. : సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా 21వ మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు మొదలైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్మిక, కర్షక ఐక్యతతోనే నల్లచట్టాలు రద్దయ్యాయని తెలిపారు. పాలకులు గుడ్డిగా చట్టాలు చేయడం వల్లనే 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సాగు చట్టాల రద్దు స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా 21వ మహాసభలు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక ఎంబీ గార్డెన్స్‌లోని వేదగిరి శ్రీనివాసరావునగర్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తమ్మినేని పాల్గొని మాట్లాడారు. దేశ రైతాంగం పట్టుదలతో ఉద్యమించి నల్లచట్టాలను తిప్పికొట్టారన్నారు. బీజేపీకి పుట్టగతులుండవనే ఉద్దేశంతోనే సాగు చట్టాలను రద్దు చేశారని తెలిపారు. ప్రభుత్వాలు గుడ్డిగా చట్టాలు చేయోద్దన్నారు. తాను తీసుకొచ్చిన సాగు చట్టాలను కొందరు రైతులు సరిగా అర్థం చేసుకోలేకపోయారని ప్రధాని మోడీ క్షమాపణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. నగదీకరణ పథకంలో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, లీజుకివ్వడం వంటి చర్యలకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటోందని తెలిపారు. ఎయిరిండియాను రూ.1,750 కోట్లకు అమ్మిందన్నారు. 2022 నాటికి కొత్త భారతదేశం చూస్తారన్న మోడీ 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేశారనీ, డిసెంబర్లో మతప్రాతిపదికన సీఏఏ చట్టం తీసుకొచ్చారనీ, 2021 ఆగస్ట్టు 5న రామజన్మభూమికి శంకుస్థాపన చేశారన్నారు. ఇలా దేశ ప్రజల హక్కులను హరించే చట్టాలను ఒకదాని వెంట ఒకటి తీసుకొస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోనూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్పై వ్యతిరేకత మొదలైందన్నారు. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 1.91 లక్షలు మాత్రమే ఉన్నాయన్న సీఎం కేసీఆర్.. దానిలో కేవలం 32వేలు మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే నిర్మించి తెలంగాణ మొత్తం నీళ్లిచ్చినట్టు సీఎం చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు నీళ్లిచ్చే సీతారామ, ఉమ్మడి నల్లగొండకు నీరిచ్చే ఎలిమినేటి మాధవరెడ్డి, మహబూబ్‌నగర్‌కు నీరిచ్చే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదితర ప్రాజెక్టులకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. యుద్ధమే అని చెప్పుకుని ఢిల్లీ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి రావడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. టీఆర్ఎస్ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందన్నారు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగురనీయొద్దని తెలిపారు. 30 ఏండ్లుగా అనేక క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న కమ్యూనిస్టు ఉద్యమానికి కష్టాలు కొత్త కాదన్నారు. అననుకూల పరిస్థితుల్లోనూ నిలబడేవాడే కమ్యూనిస్టు అని తెలిపారు. కాగా, సభా ప్రారంభానికి ముందు పార్టీ సీనియర్ నాయకులు మామిళ్ల సంజీవరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహాసభల్లో.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, పోతినేని సుదర్శన్, సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల హైమావతి, పాలడుగు భాస్కర్, యర్రా శ్రీకాంత్, ఎం.సుబ్బారావు, మాచర్ల భారతి, సోమయ్య, రాష్ట్ర నాయకులు శోభన్, బి.ప్రసాద్, జి.ధర్మ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, భూక్యా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.