Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం పేరిట బీజేపీ విభజన రాజకీయాలు
- రైతుల నుంచి ధాన్యం కొంటారా ? కొనరా ?
అది హంతకుల పార్టీ. యాసంగిలో కొనుగోలు కేంద్రాలుండవ్. పవర్బిల్లుకు మేం వ్యతిరేకం.. కొట్లాడుతం. ఈసారే కనీస మద్దతు ధర చట్టం తేవాలి. రైతుల కోసం పోతే మీకేం పనిలేదంటరా?
- కేంద్రంపై సీఎం కేసీఆర్ విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'బీజేపీ నేతలు ప్రజల్లో మతపిచ్చి లేపి విభజన రాజకీయాలు చేస్తున్నారు. దేశాన్ని రావణకాష్టంగా మార్చాలని చూస్తున్నారు. అది దేశానికే ప్రమాదకరం. ప్రజలు, రైతులు బాగుపడాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని దించాలే. దేశంలో బీజేపీ లేకుండా పారదోలాలి' అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమనీ, వాళ్లు నష్టపోకుండా కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రం ఆ ధాన్యాన్ని సేకరించకపోతే బీజేపీ ఆఫీసు ముందు, ఢిల్లీలో ఇండియా గేటు వద్ద, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముందు పోసి తమ నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కేంద్రం బాయిల్డ్‌రైస్ సేకరణకు నిరాకరిస్తున్న నేపథ్యంలోనే యాసంగిలో మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాలుడవని చెప్పారు. ఒకవేళ రైతులు ముందే విత్తన కంపెనీలు, వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటే మాత్రం వరి పండించుకోవచ్చునని తేల్చిచెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ సంస్కరణల బిల్లును వెనక్కి తీసుకోవాలనీ, కనీస మద్దతు ధరల చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రైతులకు మేలు చేయాలని వేడుకునేందుకు నలుగురు మంత్రులు, పదిమంది ఎంపీలు, సీఎస్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పోతే..ఇంత మంది వస్తరా? మీకేం పనిలేదా? అని కేంద్ర మంత్రి అనటం సిగ్గుచేటన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించడం, ప్రజాపంపిణీ వ్యవస్థద్వారా ప్రజలకు ఉచితంగా అందజేయడం, నిల్వచేయడం కేంద్రం బాధ్యత అని చెప్పారు. ఇది కొత్తగా జరగట్లేదనీ, రాజ్యాంగబద్దమైన బాధ్యత అని, స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచే ఉన్నదన్నారు. తామే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని బీజేపీ నేతలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య, మహిళలు, మైనార్టీలు, నిరుద్యోగులు, బీసీలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నదన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల పెంపే అందుకు సజీవ సాక్షమని వివరించారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన కేంద్ర సర్కారు చిల్లర కొట్టు షావుకారిలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రతి విషయంలోనూ లాభనష్టాలను బేరీజు వేసుకుని మాట్లాడుతదా? సామాజిక బాధ్యత లేదా? నిల్వలు పెరిగితే ఏం చేయాలనేదానిపై స్పష్టత లేదా? అని ప్రశ్నించారు. నష్టం వస్తే ప్రజల కోసం భరించాల్సిందేనని అన్నారు. తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాల మీద నెపాన్ని నెట్టడం కేంద్రం దిగజారుడుతనమేనని విమర్శించారు. ఉప్పుడు బియ్యం తీసుకోబోమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్‌లో బాయిల్డ్ రైస్ కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి మరీ కేంద్రం లెటర్ రాయించుకున్నదని ఆరోపించారు. రా రైస్ కోటా ఇవ్వాలని అడిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 62 లక్షల ఎకరాలో సాగుచేశాం కాబట్టి 90 లక్షల టన్నులనైనా తీసుకోవాలని కోరితే సమాధానం లేదని విమర్శించారు. తెలంగాణలో వాతావరణం దృష్టా ఎండా కాలంలో నూక శాతం ఎక్కువ ఉంటుందన్నారు. అందుకే బాయిల్డ్ రైస్ మిల్లులను ఎఫ్‌సీఐనే గతంలో ప్రోత్సహించిందని గుర్తుచేశారు. ఇప్పుడు బాయిల్డ్ రైస్‌ను గింజకూడా తీసుకోబోమని చెబుతున్నదన్నారు. బాయిల్డ్ రైస్‌గా మార్చకపోతే 50 శాతం బియ్యమే వస్తాయనీ, అది రైతులకు నష్టమని చెప్పారు. నీటి తీరువా వసూలు చేయకుండా రైతులకు నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. తెలంగాణ వచ్చాక వరి సాగు రెట్టింపు అయిందనీ, అదే స్థాయిలో వరి పంట దిగుబడి కూడా పెరిగిందని అంకెలతో వివరించి చెప్పారు. బీజేపీ 755 మంది మంది రైతులను పొట్టనపెట్టుకున్న హంతక ప్రభుత్వమనీ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్, యూపీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రైతు చట్టాల నుంచి వెనక్కి తగ్గి ప్రధాని క్షమాపణ చెప్పాడన్నారు. ముమ్మాటికీ అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్లకు సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతేగానీ, వారికి నిజంగా రైతుల మీద ప్రేమ లేదన్నారు. రైతులు, మధ్యతరగతి ప్రజల ఉసురు తీయడానికే కేంద్రం విద్యుత్ సవరణ చట్టం తెచ్చి ప్రతి బోరుకూ మీటరు పెట్టేలా రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నదని విమర్శించారు. ఢిల్లీలో రైతాంగ పోరాటంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్రం 80 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ఏడేండ్లలో చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు.
దేశంలో కల్తీవిత్తనాలను అరికట్టడానికి పీడీయాక్టు తెచ్చిన రాష్ట్రం తెలంగాణనే అని నొక్కి చెప్పారు. పీడీ యాక్టు తెచ్చేలా చూడాలని బిల్లు పంపితే ఏడునెలలు కేంద్రం పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఏడేండ్లలో తెలంగాణలో ప్రతి ఇంటికీ నీళ్లు ఇచ్చామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం వల్లనే వరి సాగు రెట్టింపు అయిందన్నారు. గొర్రెలు, చేపల పెంపకంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని ఇండియా టూడే సర్వే చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు ఐదెకరాలున్న రైతు కూడా కూలి పనిచేసుకునేవాడనీ, నేడు ఎకరం ఇరవై లక్షల నుంచి కోటి దాకా భూమి అమ్ముడుపోతున్న పరిస్థితి వచ్చిందని వివరించారు. తెలంగాణ రైతులు ఇక్కడ ఎకరం అమ్మి ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో మూడునాలుగెకరాలు కొంటున్నారని చెప్పారు.
సామాజిక బాధ్యత ఉంటే పేదలకు పంచు..
గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 116 దేశాల్లో సర్వే చేపడితే మన దేశం 101వ స్థానంలో నిలిచిందనీ, బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆకలి కేకలు పెరిగాయని చెప్పారు. పాకిస్తాన్ 92, బంగ్లాదేశ్, నేపాల్ 76వ ర్యాంకుల్లో ఉన్నాయని గుర్తుచేశారు. ఓ కవి చెప్పినట్టు అన్నపురాసులు ఒకవైపు..ఆకలికేకలు మరోకవైపు అన్నట్టుగా దేశం పరిస్థితి తయారైందనీ, ఇందుకు బీజేపీనే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిల్వలు పేరుకుపోయాయని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి అన్నం లేక అలమటిస్తున్న వారిని ఆదుకోవాలనే సామాజిక బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. నిజంగా కేంద్రానికే సామాజిక బాధ్యత ఉంటే నిల్వ ఉన్న బియ్యాన్ని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
పెంచిందే బీజేపీ..తగ్గించాలని ధర్నాలా ?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది నరేంద్రమోడీ ప్రభుత్వం కాదా? కిషన్‌రెడ్డి ఆయన మంత్రి వర్గంలోనే ఉన్నారు కదా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే..ఇక్కడేమో ఆ పార్టోళ్లు ధర్నాలు చేస్తున్నారు..వారికి కొంచమైనా సిగ్గుండాలే అని అన్నారు. 2014కు ముందు క్రూడాయిల్ ధర ఎంత? ఇప్పుడెంత? అని ప్రశ్నించారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని ధర్నాలు చేయాల్సిరావడం సిగ్గుచేటన్నారు. బీజేపోళ్లు కచ్చితంగా దేశాన్ని ముంచెటోళ్లు తప్ప మంచి చేసెటోళ్లు కాదని తేలుతున్నదని చెప్పారు.
కిషన్‌రెడ్డి చేతగాని వ్యక్తి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతగాని వ్యక్తి అని సీఎం కేసీఆర్ విమర్శించారు. నిజంగా ఆయనకు రైతుల మీద ప్రేమే ఉంటే బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రంతో చెప్పించాలన్నారు. వ్యవసాయ విధానం లేనిదే ఇంత ధాన్యం పండించినవా? బాయిల్డ్ రైస్ రైతులు పండిస్తరా? మిల్లర్ల కోసం కేసీఆర్ పనిచేస్తున్నాడు..అని బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. మన రాష్ట్ర బీజేపీ ఎంపీలను, మంత్రిని ఢిల్లీలో ఎవ్వరూ కానరని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ పాలన కంటే తమది వెయ్యి రెట్లు మంచిగుందని చెప్పారు. కిషన్‌రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టార్గెట్ చెప్పే, సాధించే దమ్ము లేదు.. సిగ్గుపోతుందని కేంద్రానికి చెప్పాలని సూచించారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. వాట్సాప్ యూనివర్సిటీకి చెందిన కొందరు టీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, దాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కిషన్‌రెడ్డి, బండిసంజరు అవగాహనలేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీని నమ్ముకుంటే రాష్ట్రానికి శంకరిగిరి మాన్యాలు తప్పవని వ్యాఖ్యానించారు.