Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్ల్లుగా ప్రతిపాదనలు పెండింగ్
- అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్న వైనం
నవతెలంగాణ - జగిత్యాల టౌన్
పేరుకే జిల్లా కేంద్రం కానీ శాఖల్లో అన్నీ ఖాళీలే.. గ్రామీణ నీటి సరఫరా శాఖలో ఏండ్లుగా ఖాళీలు భర్తీ కావడం లేదు. ప్రతిపాదనలు పంపినా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామీణ నీటి సరఫరా శాఖ నిత్యం ప్రజలతో మమేకమయ్యే అతికొద్ది శాఖల్లో ముఖ్యమైనది. ప్రజలకు ప్రతిరోజూ తాగునీటి సరఫరా, నిర్వహణ చూడాల్సిన బాధ్యత ఈ శాఖదే. కానీ ఏఈ పోస్టుల ఖాళీలతో సతమతమవుతోంది.జగిత్యాల జిల్లా పరిధిలో జగిత్యాల, మెట్పల్లి, ధర్మపురి మూడు సబ్ డివిజన్లు ఉన్నాయి. జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలో ఏడు మండలాలు, మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో ఆరు మండలాలు, ధర్మపురి సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. వీటిలో జగిత్యాలలో ఇద్దరు, మెట్పల్లిలో ఆరుగురు, ధర్మపురిలో ముగ్గురు చొప్పున పని చేస్తున్నారు. జగిత్యాలలోనే అత్యధికంగా ఐదు ఏఈ పోస్టులు, ధర్మపురిలో రెండు ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలో మొత్తం ఏడు పోస్టులకు(చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని కొడిమ్యాల, మల్యాల మండలాలను కలుపుకొని) ఇద్దరు ఏఈలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరినే జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలోని మిగిలిన ఐదు మండలాలకు కూడా ఇన్‌చార్జీలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.
దీంతో వారిద్దరిపై అదనపు పని భారం పడటంతో ఎప్పుడు ఎక్కడికి పోవాలో తెలియక సతమతమవుతున్నారు. నీటి సరఫరా నిర్వహణ లోపం వల్ల ప్రజలకు శుద్ధమైన తాగునీరు లభించక అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి తోడు గతంలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం పనులు చేపట్టేందుకు వారు విముకత చూపుతున్నారు. కొత్తవారు ఎవరూ పనులు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో ప్రతినిత్యం తాగునీటి సరఫరా, నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
లీకేజీలతోనూ సమస్యే..
బీఎస్ఎన్ఎల్, రిలయన్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వంటి సంస్థల పనుల కోసం తవ్వకాలు జరపడం వల్ల పలుచోట్ల నీటి పైపు లైన్లు పగిలాయి. మరమ్మతులకు నోచుకోకపోవడంతో నీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అరకొర సిబ్బందితోనే..
నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన రాయికల్‌లో సుమారు 60కిలోమీటర్ల మేర పైపు లైన్లకు 90 గేట్ వాల్స్ ఉన్నాయి. మున్సిపాలిటీకి చెందిన నలుగురు సిబ్బందితోనే పని కానిచ్చేస్తున్నారు. వారికి ఏఈ, డీఈఈ నుంచి కనీస సహకారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉంది.
అదనపు పనిభారం.. పట్టింపులేని ప్రభుత్వం..
తీవ్ర పని ఒత్తిడి కారణంగా ఏఈ, డీఈఈ, ఈఈలకు సెలవులు కూడా లభించక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై జగిత్యాల సబ్ డివిజన్ డీఈఈ రామారావును వివరణ కోరగా.. ఇదివరకే పలుమార్లు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన ఉండటం లేదని చెప్పారు. మెట్పల్లి సబ్ డివిజన్ పరిధి నుంచి డిప్యుటేషన్‌పై తీసుకునేందుకు ప్రయత్నించినా.. చివరి నిమిషంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో ఖాళీలు భర్తీ కావడం లేదన్నారు. ప్రభుత్వం భర్తీ చేసే వరకు వేచి ఉండాల్సిందే తప్ప తన చేతుల్లో ఏమీ లేదన్నారు.