Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఔట్ పేషంట్ సేవల నిలిపివేత
నవతెలంగామ బ్యూరో -హైదరాబాద్
నీట్-పీజీ-2021 కౌన్సిలింగ్ నిర్వహించటంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా డిసెంబర్ ఒకటి నుంచి మూడు వరకు అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సాగర్, డాక్టర్ కార్తీక్, జాయింట్ ప్రెసిడెంట్ డాక్టర్ వివేక్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు నిరసన తెలుపుతున్నారని గుర్తుచేశారు. ఈ ఏడాది జనవరిలో జరగాల్సిన పరీక్షలు కోవిడ్ కారణంగా రెండు సార్లు వాయిదా వేసి సెప్టెంబర్లో నిర్వహించారనీ, పరీక్షలు జరిగి రెండు నెలలు గడుస్తున్నా కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించటం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టులో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లపై నడుస్తున్న కేసును జనవరి 6కు వాయిదా వేయటంపై ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలింగ్ ఆలస్యంతో ఈ ఏడాది మార్చిలో ప్రవేశాలు పొందాల్సిన కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్యాచ్ వచ్చే ఏడాది జనవరి నాటికి కూడా జాయిన్ కాలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీంతో రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్యాచ్లు మాత్రమే ఉండటంతో ముగ్గురు చేయాల్సిన పనిని ఇద్దరితో చేయిస్తున్నారనీ, తద్వారా రెసిడెంట్ డాక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో డాక్టర్లు సన్నద్ధం కావాల్సి ఉందని వెల్లడించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపులో భాగంగా సేవలను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు. డిసెంబర్ 3 నాటికి కేంద్ర ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు నుంచి స్పందన రాకపోతే 4 నుంచి నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం కౌన్సిలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.